ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1933 కరోనా కేసులు...19 మరణాలు - andhrapradesh corona cases

corona-positive-case
corona-positive-case

By

Published : Jul 12, 2020, 2:53 PM IST

Updated : Jul 13, 2020, 4:43 AM IST

13:27 July 12

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది.  రికార్డు స్థాయిలో ఒకేరోజు 2 వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రతి వందమందికి నిర్వహించిన  పరీక్షల్లో వైరస్ 10.86 శాతంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. కొవిడ్‌తో మరో 19 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఒకేరోజు ఇన్ని పాజిటివ్‌ కేసులు, మృతులు నమోదవ్వడం ఇదే తొలిసారి.

రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి రోజురోజుకు మరింత విస్తరిస్తోంది. ఏకంగా ఒకేరోజు 19 వందల 33 మందికి పాజిటివ్‌గా నిర్థరణ అయ్యింది. 17వేల 624 నమూనాలను సేకరించగా.... దాదాపు 2వేలకు చేరువలో కేసులు వచ్చాయి. పరీక్ష నమూనాల్లో  ప్రతి వందమందిలో 10.86 మందికి కొవిడ్‌ సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి వ్యాధి సంక్రమించగా...వారిలో 16 మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే ఉన్నారు.  రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 268, కర్నూలులో 237, కృష్ణా జిల్లాలో 206 మందికి పాజిటివ్ వచ్చింది. కడప, విశాఖ, పశ్చిమగోదావరి మినహా....మిగిలిన జిల్లాల్లోనూ వందకు పైగా కేసులు నమోదయ్యాయి. కరోనాతో కొత్తగా 19 మంది చనిపోయారు. ఒకేరోజు ఇన్ని కేసులు, ఇంతమంది చనిపోవడం ప్రప్రథమం. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసులు 29 వేల 168కి చేరగా..... 328 మంది మృతిచెందారు. వివిధ ఆస్పత్రుల్లో 13 వేల 428 మంది  చికిత్స పొందుతున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషతోపాటు భార్య, కుమార్తెకు  సైతం కరోనా సోకింది. తొలుత తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న వారు...అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ వెళ్లారు.

గుంటూరు జిల్లాలో వరుసగా వందల సంఖ్యలో కేసులు నమోదుకావడం కలవరపెడుతోంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో కేసుల తాకిడి ఎక్కువగా ఉంది. కొత్తగా వినుకొండలో 31 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కడప జిల్లా రైల్వేకోడూరులో 65 ఏళ్ల ఓ వృద్ధురాలు కరోనాతో మృతిచెందింది. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యాక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె కుప్పకూలిపోయి చనిపోయింది. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్‌ సిబ్బంది వదిలేసి వెళ్లడంతో స్థానికులు ఆందోళన చెందారు. కమలాపురంలోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రంలో సరైన వసతులు లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.  ఆలమూరు మండలం జొన్నాడలోని గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళలకు కరోనా సోకింది. ఆత్రేయపురం మండలం పేరవరంలోనూ మరో రెండు కేసులు వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అధికాకరులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పాతచీరాలకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.  విశాఖ జిల్లా రావికమతం మండలం కొత్తకోటలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. క్వారంటైన్ కేంద్రాల్లో సరైన వసతులు లేవంటూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ నిరసన తెలిపారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా....ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం లేదు. నెల్లూరు గ్రామీణ మండలం ములుమూడిలో చేపల కోసం వందలాది మంది ప్రజలు ఎగబడ్డారు. కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా చెరువు వద్దకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు.

ఇదీ చదవండి:

కనువిందు చేస్తున్న కైగల్ జలపాతం

Last Updated : Jul 13, 2020, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details