ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆదిలాబాద్‌ రిమ్స్‌ నుంచి 10 మంది కరోనా బాధితులు పరారీ - ఆదిలాబాద్‌ రిమ్స్‌ నుంచి కరోనా బాధితుల పరారీ

ఆదిలాబాద్‌ రిమ్స్‌ కొవిడ్‌ వార్డు నుంచి 10మంది బాధితులు పరారయ్యారు. ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి.

10-covid-patients-escape-from-adilabad-rims-covid-ward
ఆదిలాబాద్‌ రిమ్స్‌ నుంచి 10 మంది కరోనా బాధితులు పరారీ

By

Published : Aug 2, 2020, 12:24 AM IST

తెలంగాణలోని ఆదిలాబాద్‌ రిమ్స్‌ కొవిడ్‌ వార్డు నుంచి 10మంది బాధితులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. పరారైన వారిలో ఐదుగురు పురుషులు, మరో ఐదుగురు మహిళలు ఉన్నట్లు రిమ్స్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో ఇంద్రవెల్లి మండలానికి చెందిన ఇద్దరు, నిజామాబాద్​కు చెందిన ఒకరు ఉండగా.. ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీకి చెందిన వారు ఇద్దరు, కైలాస్‌నగర్‌, ఖానాపూర్‌, ద్వారకానగర్‌, కుమ్మరికుంట కాలనీ వాసులు ఒకరి చొప్పున, ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చాందా-టి కి చెందిన ఒకరు పరారైన వారిలో ఉన్నారు.

సిబ్బంది ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తుండగా బాధితులు తప్పించుకున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ బానోత్‌ బలరాం చెబుతున్నారు. బాధితుల పరారీపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన రిమ్స్‌ వర్గాలు.. తమ వద్ద ఉన్న బాధితుల చరవాణి ఆధారంగా వారి ఆచూకీకి ప్రయత్నాలు చేస్తున్నా అవి అందుబాటులో లేనట్లుగా తెలుస్తోంది. మరోవైపు కొవిడ్‌ వార్డులో సరైన సౌకర్యాలు లేవని చికిత్స పొందుతున్న బాధితులు చెబుతున్నారు. తమ పరిస్థితిపై వీడియో తీసి గోడు వెళ్లబోసుకున్న విషయం ఈటీవీలో ప్రసారమైంది.

స్పందించిన పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ రిమ్స్‌ను సందర్శించి మెరుగైనచికిత్సలు అందించాలని ఆదేశించిన మరుసటి రోజునే బాధితులు పరారీ ఘటన వెలుగుచూడటం చర్చనీయాంశంగా మారింది. పరారైన కరోనా బాధితుల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

ఇదీ చదవండి: 20 గంటలు మృతదేహంతో గడిపిన కరోనా బాధితులు

ABOUT THE AUTHOR

...view details