సార్వత్రిక ఎన్నికల ముందు వినియోగదారులకు పన్ను మినహాయింపు పెంపుతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. బాంబే ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 212 పాయింట్లు(0.59 శాతం) పెరిగి 36,469.43 పాయింట్ల వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 62.70 పాయింట్లు(0.58 శాతం) ఎగబాకి 10893.65 వద్ద స్థిరపడింది.
ఆదాయపు పన్ను పరిమితిని పెంపుతోపాటు, చిన్న సన్న కారు రైతులకు రూ. 6వేలు అందించనున్నట్లు పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. వీటన్నింటితో కొనుగోలు శక్తి పెరగనున్న దృష్ట్యా మదుపరుల సెంటిమెంటు సానుకూలంగా ప్రభావితమైంది. వాహన, వినియోగ వస్తువుల షేర్లు వృద్ధిలోకి వచ్చాయి.
ఇంట్రాడే తీరిది...
మొదట 550 పాయింట్ల లాభపడ్డ సెన్సెక్స్ 36,771.14 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. అనంతరం 36,221.32 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని చేరుకుంది. అదే సమయంలో నిఫ్టీ 10,983.45 పాయింట్ల వద్ద అత్యధికాన్ని...10,813 పాయింట్ల వద్ద అత్యల్పాన్ని తాకింది.
వివిధ రంగాల తీరు..
బీఎస్ఈలోని ఆటో, ఎఫ్ఎమ్సీజీ, స్థిరాస్తి సూచీలు 2.62 శాతం వరకు లాభపడ్డాయి.
సెన్సెక్స్‌లో హీరో మోటోకార్ప్, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ అత్యధికంగా 7.48 శాతం వరకు లాభపడ్డాయి.