నేతలు పట్టించుకోవడం లేదని... ఓటింగ్ బహిష్కరణ - WARD NO 9
విశాఖలోని సింహాద్రిపురం వాసుల నివాసం నగరం నడిబొడ్డున ఉంటే ఓటు మాత్రం భీమిలి నియోజకవర్గంలో వేయాల్సి వస్తోంది. ఎన్నోసార్లు నేతలకు చెప్పినా ఫలితం లేకపోయినందున.. తమకు న్యాయం జరిగే వరకు ఓటు హక్కు వినియోగించుకోమని విశాఖ 9 వార్డులోని ప్రజలు శపథం చేశారు.
విశాఖ 9వ వార్డులోని సింహాద్రిపురం వాసులు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆందోళన బాట పట్టారు. సింహాద్రిపురం నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ కాలనీవాసుల ఓట్లు మాత్రం భీమిలి నియోజకవర్గంలో కలవడంపై ఇక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీ తూర్పు నియోజకవర్గం పరిధిలోకి వస్తుందనీ... ఓట్లు మాత్రం ఎక్కడో దూరంగా ఉన్న భీమిలి నియోజకవర్గ పరిధిలో కలిపారని నిరసన చేపట్టారు. ప్రజా ప్రతినిధులకు తమ ఓట్లు కావాలే తప్పా...తమ బాధలు అవసరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ వాసుల్లో చాలామంది ఓట్లు గల్లంతయ్యాయని మండిపడ్డారు. 9వ వార్డులోని సింహాద్రి నగర్ ప్రజలందరినీ తూర్పు నియోజకవర్గంలో కలపాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఓటు హక్కు వినియోగించుకునేది లేదని తేల్చి చెప్పారు.