రాష్ట్రానికి నాలుగు రోజుల్లో వర్షాలు - rtgs
రాష్ట్రానికి మరో 24 గంటల్లో రుతుపవనాలు రానున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఈ క్రమంలో మరో 4 రోజుల్లో ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.
రాష్ట్రం చిటపట చినుకులతో తడవనుంది. మరో 24 గంటల్లో ఏపీకి రుతుపవనాలు రానున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వేగంగా రుతుపవనాలు కదులుతున్నాయి. ఇవాళ ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని ఆర్టీజీఎస్ వెల్లడించింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 4 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ స్పష్టం చేసింది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని చెప్పింది. అత్యధికంగా 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఆర్టీజీఎస్.