పుల్వామా ఉగ్రదాడిపై చైనా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కానీ ఐక్యరాజ్య సమితి నిషేధించిన పాకిస్థాన్ ఆధారిత తీవ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలన్న భారత వినతిని మాత్రం మరోమారు తోసిపుచ్చింది.
1267 భద్రతా మండలి కమిటీ ద్వారా అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించాలని భారత్, అమెరికా, యూకే, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదనలను తిరస్కరించే అధికారం కలిగిన సభ్యుల్లో చైనా ఒకటి. అలాగే పాకిస్థాన్‌తో మంచి సంబంధం కలిగి ఉంది. భారత డిమాండ్‌ను నేరుగా తిరస్కరించకుండా... దొడ్డిదారి అనుసరించింది చైనా. జైషే మహ్మద్ ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కమిటీ ఆంక్షల జాబితాలో ఉందంటూ అజర్‌పై చర్యల ప్రతిపాదనను తోసిపుచ్చింది.