కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలోని చెక్ పోస్టు వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన వారంతా కలిసి వెళ్తున్న తుపాను వాహనాన్ని... వోల్వో బస్సు ఢీ కొట్టిన ఘటనలో 15 మంది మృతి చెందారు. ఘటనా స్థలిలోనే 13 మంది దుర్మరణం పాలవగా... ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణం విడిచారు. చికిత్స పొందుతూ ఇంకొకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన కారణంగా... ఆసుపత్రికి తరలించారు. మృతులను గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం వాసులుగా గుర్తించారు.
కర్నూలులో ప్రమాదం.. 15 మంది తెలంగాణవాసులు మృతి
ఘోరం జరిగిపోయింది. కొన్ని రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. పెళ్లి చూపులకు వెళ్లి.. తిరిగి ఇంటికి వెళ్తున్న ఆ కుటుంబసభ్యులను మృత్యువు రూపంలో ముంచుకొచ్చిన వోల్వో బస్సు.. కబళించివేసింది.
ఉదయం పెళ్లి చూపులకని గుంతకల్లు వెళ్లిన రామాపురం వాసులు.. నిశ్చితార్థం చేసుకుని తిరుగుప్రయాణమయ్యారు. వెల్దుర్తి సమీపంలోకి రాగానే... వోల్వో బస్సు రూపంలో వారికి మృత్యువు ఎదురైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్ వోల్వో బస్సు.. వెల్దుర్తి చెక్ పోస్టు వద్ద అదుపు తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి... డివైడర్ ఎక్కి.. అవతలివైపు దూసుకెళ్లింది. అదే సమయంలో అటువైపునుంచి వస్తున్న తుపాన్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి స్థానికులు పరుగుపరుగున చేరుకున్నారు. జీపులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో వాహనాలు తొలగించారు.