'వైకాపాలోకి పీవీపీ,రాజారవీంద్ర, తోట దంపతులు' ఎన్నికల షెడ్యూల్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇన్నాళ్లు వేచి చూసే ధోరణిలో ఉన్న నేతలంతా ఒక్కసారిగా యాక్టీవ్ అయ్యారు. అనుకూలమైన పార్టీలో చేరిపోతున్నారు. కండువాలు మార్చేస్తున్నారు. ఆ బాటలోనే తెలుగుదేశం ఎంపీతోట నరసింహం వైకాపాలోకి చేరిపోయారు. ఆరోగ్యరీత్యా తను ఈ ఎన్నికలకు దూరంగా ఉంటాని చెప్పిన తోట... తన భార్య వాణికి జగ్గంపేట టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం అధిష్ఠానానికి అభ్యర్థించారు. అక్కడ జ్యోతుల నెహ్రును కాదని ఎవరికీ టికెట్ ఇవ్వలేమని చంద్రబాబు తేల్చేశారు ఇంతలో పెదాపురం టికెట్ ఇస్తామని వైకాపా నుంచి ఆఫర్ రావడంతో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని దంపతులిద్దరూ వైకాపాలో చేరారు.
పొట్లూరు వరప్రసాద్... గత ఎన్నికల్లో విజయవాడ టికెట్ కోసం తీవ్రంగా శ్రమించిన ఈయనకు ఎక్కడా ఆ అవకాశం దక్కలేదు. ఈసారి మాత్రం వైకాపా నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఆ పార్టీ నుంచి పోటీకి నిర్ణయించారు. ఈ ఉదయం జగన్‌తో భేటీ అయిన ఆయన... సీటుపై మంతనాలు జరిపారు. అనంతరం అక్కడే పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరిపోయారు.
పలువురు ప్రముఖ సినీ హీరోలకు మేనేజర్‌గా పని చేస్తున్న క్యారెక్టర్ నటుడు రాజారవీంద్ర రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జగన్ సమక్షంలోనే వైకాపాలో చేరారు.