జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడితో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అత్యంత భయంకరమైన ఘటనల్లో ఇదొకటిగా పేర్కొంటున్నారు. ఈ ఉగ్రదాడిలో సుమారు 40 మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
దంతెవాడ ఘటన తర్వాత ఇదే.... - భారత చరిత్ర
జమ్ముకశ్మీర్ పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో రెండో అత్యంత దారుణమైన ఘటన. 2010లో మావోయిస్టులు 76 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బలి తీసుకున్నారు
దంతెవాడ ఘటన తర్వాత ఇదే
2010లో ఛత్తీస్‌గఢ్ దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దాడిలో 76 మంది సిబ్బంది మరణించారు. ఇప్పటివరకు భారత్‌లో ఇదే అత్యంత విషాదకర ఘటన. భారతదేశ చరిత్రలో జరిగిన ఉగ్రదాడుల గురించి ఒకసారి పరిశీలిద్దాం...
- 2001లో కశ్మీర్ అసెంబ్లీ ద్వారం వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు ఉగ్రవాదులు. సుమోలో పేలుడు పదార్థాలతో వచ్చిన ముష్కరులు తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 2015 మార్చి 20న ఆర్మీ దుస్తులు ధరించి వచ్చిన ఉగ్రవాదులు కతువా పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బంది మరణించారు.
- 2017 డిసెంబర్ 31న జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలోనే ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు.
- 2016 జూన్‌లో లేత్పోరాకు సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో 8 మంది జవాన్లు అమరులయ్యారు.
- అదే ఏడాది జరిపిన దాడిలో ఫిబ్రవరిలో ముగ్గురు సైనికులు సహా 9 మంది మరణించారు.
- 2016 సెప్టెంబర్‌లో ఉరీలోని సైనిక స్థావరంపై 18 మంది జవాన్లు మరణించారు. దీనికి ప్రతీకారంగానే భారత్ మెరుపు దాడులు నిర్వహించింది.
- 2010లో ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలి తీసుకున్నారు. ఇప్పటివరకు భారత్‌లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి.
- తర్వాత ఏడేళ్లకు సుక్మాలో జరిపిన మావోయిస్టుల దాడిలో 25 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
- ఇప్పుడు 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మందికి పైగా మరణించారు.