రాబోయే ఐదేళ్లకు రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ.4 లక్షల 79 వేల 823 కోట్లు ఇవ్వాలన్నారు. అమరావతి సచివాలయంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో కలిసి ఏపీ పర్యటనకొచ్చిన 15వ ఆర్థిక సంఘ సభ్యుడు అజయ్ నారాయణ్‌తో సీఎస్ సమావేశమయ్యారు. ముందుగా రాష్ట్ర ఆర్థిక ప్రగతి, విభజన చట్టాన్ని అనుసరించి అమలు చేయాల్సిన అంశాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అజయ్ నారాయణ్‌కు వివరించారు.
15వ ఆర్థిక సంఘ సభ్యులతో సీఎస్ భేటీ - subrahmanyam
పునర్విభజన చట్టంలో అంశాలను అమలు చేస్తూ, దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధికి సహకరించాలని 15వ ఆర్థిక సంఘసభ్యుడు అజయ్ నారాయణ్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం కోరారు. రాజధాని నిర్మాణం, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, పోర్టులు, ఎయిర్ పోర్టులతో కలుపుతూ రహదారుల నిర్మాణానికి.. 69 వేల 687 కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ఎయిడ్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
2017-18 నాటికి తలసరి ఆదాయంలో తెలంగాణ రూ.లక్ష 81 వేల 34 రూపాయలు, తమిళనాడు రూ.లక్ష 66 వేల 934, కర్నాటక రూ.లక్ష 81 వేల 788, కేరళ రూ.లక్ష 80 వేల 518 రూపాయలతో ముందుంజలో ఉండగా, ఏపీ రూ.లక్ష 42 వేల 53 రూపాయలతో వెనుకబడి ఉందన్నారు. 2017-18 స్థూల జాతీయోత్పత్తి లెక్కల ప్రకారం తయారీ, సేవల రంగంలో దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీ అట్టడుగు స్థానంలో ఉందన్నారు. ఇంతటి ఇబ్బందికర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాల అమలులోనూ, శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి, అక్షరాస్యత, జీవన ప్రమాణం పెంపుదలతో ఏపీ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని సీఎస్ 15వ ఆర్థిక సంఘానికి వివరించారు.