ఆర్థిక, రెవెన్యూ శాఖలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్థికశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు.
ఆదాయ మార్గాలు అన్వేషించాలి: సీఎం జగన్ - జగన్‌మోహన్‌రెడ్డి
ముఖ్యమంత్రి జగన్ శాఖలవారీగా సమీక్షలు చేపట్టారు. ఆర్థిక, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశమైన సీఎం.. ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు.
ఎక్సైజ్‌శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను సూచించిన జగన్.. మద్యం గొలుసు దుకాణాలను సమూలంగా తొలగించాలని ఆదేశించారు. ఎక్కడైనా బెల్ట్ షాపు కనిపిస్తే చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాప్‌కు మద్యం సరఫరా చేసే దుకాణ లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్ట్‌షాపుల వ్యవస్థను నిర్మూలించాలని సూచించారు. దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేయాలన్న సీఎం... రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అస్తవ్యస్థంగా ఉన్న ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు అందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్న ముఖ్యమంత్రి... సృజనాత్మక ఆలోచనా విధానాలతో రావాలని అధికారులకు సూచనలు చేశారు.
ఈ సమావేశంలోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి.సాంబశివరావు, పీ.వీ.రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.