తప్పుడు పని అన్నందుకు ప్రాణం తీశాడు సాయిసాగర్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు స్నేహితులతో కలిసి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడ కారులో మోబిన్ అనే వ్యక్తి తన ప్రియురాలితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఇది గమనించిన సాయిసాగర్ పద్ధతి కాదంటూ మోబిన్ను సున్నితంగా మందలించాడు. ప్రియురాలి ముందు అవమానం జరిగినట్టు భావించిన అతడు కోపంతో సాయిసాగర్తో పాటు అతని స్నేహితులపై దాడి చేశాడు. గాయపడిన సాయిసాగర్ అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అక్కడ పోలీసుల ఎదుటే స్టేషన్ లో సాయిసాగర్ను మోబిన్ తీవ్రంగా కొట్టాడని ఆరోపిస్తున్నారు బాధితులు.
సాయిసాగర్కు 20 రోజుల క్రితమే పెళ్లి
ఇరవై రోజుల క్రితమే సాయిసాగర్కు వివాహమైందని.. ఇంతలోనే సాయిసాగర్ హత్యకు గురవడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. సాయిసాగర్ను హత్య చేసిన కేసులో నిందితుడైన మోబిన్పై నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 16 కేసులు ఉన్నాయి. పీడీ యాక్టు కేసు కూడా ఉంది. ఇటీవలే జైలు నుంచి వచ్చిన మోబిన్ ఈ హత్యకు పాల్పడ్డాడని.. నిందితున్ని తమకు అప్పగిస్తే అతనికి శిక్ష తామే విధిస్తామని అర్థరాత్రి ఉస్మానియా ఆసుపత్రిలో బాధితులు ఆందోళనకు దిగారు.
ఉద్రిక్తత
మోబిన్ను ఉస్మానియా ఆస్పపత్రికి తీసుకురాకుంటే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటామంటూ పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం వల్ల ఉస్మానియా ఆసుపత్రిలో భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల నిర్లక్ష్యమే సాయిసాగర్ మృతికి కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. దాడి ఘటనలో మృతి చెందిన సాయిసాగర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు పోలీసులు.