కుటుంబ నేపథ్యం
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి పంచాయతీలోని రెయ్యిపేటకు చెందిన పరపటి అప్పన్న అంధత్వలోపంతో జన్మించారు. తన స్థితికి ఎప్పుడూ చింతించని అప్పన్న..ప్రభుత్వ కొలువు సాధించాలనే తపనతో పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యాడు. అప్పన్న తల్లిదండ్రులు కర్రెయ్య, సీతమ్మ. వారికి ఇద్దరు కుమారులు. వారివురికీ అంధత్వంలోపం ఉంది. అప్పన్న సోదరుడు రమేష్..జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్నాడు.
విద్యాభ్యాసం
అప్పన్న ప్రాథమిక విద్యాభ్యాసం విశాఖపట్నం, విజయనగరంలోని అంధత్వ పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ మహబూబ్నగర్ అంధత్వ కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం 2008 నుంచి 2011 వరకు హైదరాబాద్లోని బాబూ జగ్జీవన్ రామ్ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తయ్యాక బతుకుదెరువు కోసం అంధుల ఆర్కెస్ట్రాలో చేరాడు. ఓ వైపు ప్రదర్శనలిస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. విజయవాడ విజన్ త్రూ ఇయర్స్ అనే సంస్థ ఆడియో పాఠాల ద్వారా సాధన ప్రారంభించి 2018లో ఐబీపీఎస్ పీవో పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఈ పరీక్షలో విజయం సాధించి యూనియన్ బ్యాంక్ పీవోగా ఉద్యోగం పొందాడు.