రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది అధికార పక్షం. యూపీఏతో పోల్చితే తామే చౌక ధరకు యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నామని చెబుతోంది. తాజాగా పార్లమెంటులో కాగ్ ప్రవేశపెట్టిన నివేదికతో రఫేల్ రాజకీయం కీలక మలుపు తిరిగింది.
2012లో యూపీఏ హయాంలో ఫ్రాన్స్ నుంచి 126 విమానాలు కొనేందుకు రూ.54వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని రద్దు చేసి డసో ఏవియేషన్‌తో 36 రఫేల్ యద్ధ విమానాలను రూ.58 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకుంది. ఇలా ఒప్పందం మార్చడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రఫేల్ ఒప్పంద పత్రాలను బయట పెట్టాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్.
డసో ఏంటి... ఒప్పందమెలా?
బహుళ సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు తయారు చేయటంలో డసో ప్రముఖ కంపెనీ. డసో రూపొందించిన రఫేల్ విమానాల్లో రాడార్ వ్యవస్థ శత్రు విమానాల జాడను తెలుసుకోవచ్చు. రఫేల్‌ను ఇతర విమానాలు కనుక్కోవాలంటే మాత్రం అసాధ్యం. అత్యాధునిక సూపర్ క్రూయిజ్ రఫేల్ జెట్ల సొంతం.
యూపీఏ పాలనలో రక్షణ మంత్రి ఏకే ఆంటోని 126 యుద్ధ విమానాలు కొనుగోలుకు 2007లో నిర్ణయించారు. దీనికి వాయుసేన అనుమతి కూడా లభించింది. టెండర్ల ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీ పోటీ పడ్డాయి. వీటిల్లో బోయింగ్, గ్రిపిన్, టైపూన్, మిగ్ లాంటి ప్రఖ్యాత కంపెనీలున్నా తక్కువ ధర అందించిన డసోతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రక్రియ 2012లో పూర్తయింది.
ఒప్పందం ప్రకారం మొదటగా ఎగరడానికి సిద్ధంగా ఉన్న 18 విమానాలను అందించి.. మిగతా 108 జెట్లను ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ భాగస్వామ్యంలో భారత్‌లోనే తయారు చేయాలి. ఇందులో భారత్‌కు శాస్త్ర సాంకేతికతను అందివ్వాల్సి ఉంటుంది. యూపీఏ ప్రకటించినదాని ప్రకారం మొత్తం రూ. 54 వేల కోట్లు. అంటే ఒక్కో విమానానికి రూ.526 కోట్లు.
2015 ఏప్రిల్ - మోదీ ఫ్రాన్స్ పర్యటన...