నకిలీ పత్రాలతో కోట్లు స్వాహా...బ్యాంకు అధికారుల చేతివాటం నకిలీ పత్రాలతో సృష్టించి పనిచేస్తోన్న బ్యాంకులోనే మోసానికి పాల్పడ్డారు..కడప జిల్లా ఖాజీపేట సిండికేట్ బ్యాంకు అధికారులు. అమాయకుల పేర్ల పత్రాలు సృష్టించి రూ. 2.22 కోట్లు స్వాహా చేశారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు బ్యాంకు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. వీరిలో బ్యాంకు మేనేజర్ టి. జయంత్‌బాబుతోపాటు స్థానికి దినపత్రికకు చెందిన విలేకరి మీసాల వెంకటసుబ్బయ్య, వెలుగు యానిమేటర్ మునికాంతమ్మలు ఉన్నారు. 2014-16 మధ్య కాలంలో బ్యాంకు మేనేజర్‌గా ఉన్న జయంత్‌బాబు ఈ మోసాలు పాల్పడ్డారని మైదుకూరు గ్రామీణ సీఐ వివరించారు. 49 పంట రుణాలు, 20 ముద్రరుణాలు, నాలుగు స్వయం సహాయక సంఘాల రుణాలు స్వాహా చేసినట్లు తెలిపారు. అమాయకుల నుంచి పత్రాలు తీసుకుని నామమాత్రపు సొమ్ము చేతిలో పెట్టి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేశారన్నారు. నకిలీ పత్రాలు తయారు చేయడంలో సూత్రధారి అయిన ఎల్లయ్య పరారీ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రెవెన్యూ అధికారులు, వెలుగు సిబ్బంది ప్రమేయంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.