ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభకు సభాపతిగా తమ్మినేని సీతారామ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన పేరును నేడు ప్రకటించనున్నారు. రెండో రోజు ఉదయం 9 గంటలకు సమావేశం కానున్న శాసనసభ...ముందుగా నిన్న ప్రమాణం చేయని సభ్యులు పదవీ స్వీకారం చేస్తారు. తొలిరోజు ముఖ్యమంత్రి జగన్, విపక్షనేత చంద్రబాబు సహా 173 మంది శాసన సభ్యులతో ప్రోటెం స్పీకర్ శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రమాణం చేయించారు. వ్యక్తిగత కారణాలతో సభకు హాజరుకాలేకపోయిన నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి... ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం సాయంత్రానికి స్పీకర్ పేరు అధికారికంగా ప్రకటిస్తారు.
వైకాపా నేత తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌గా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారు. సభాపతి పదవికి సీతారామ్ బుధవారం నామినేషన్ వేశారు. 30 మంది వైకాపా సభ్యులు మద్దతు ఆయనకు పలికారు. స్పీకర్ పదవికి మరో నామినేషన్ దాఖలు కానందున సీతారామ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
సీతారామ్ ప్రస్థానం
ఆంధ్రప్రదేశ్ 15వ శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్ ఎన్నిక లాంఛనమే. తమ్మినేని సీతారామ్....ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా తరఫున శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యేగా నుంచి గెలుపొందారు. ఇప్పటికి ఆరుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న సీతారామ్....కళింగ సామాజిక వర్గానికి చెందినవారు.