రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాసనసభ నియోజకవర్గాల్లో రెండో రోజు మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో తెదేపా అభ్యర్థి గౌతు శిరీష 4 సెట్ల నామినేషన్లు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్, గొర్లె పరిమళ 3 నామినేషన్లు వేశారు. నరసన్నపేట నుంచి నాయుడుగారి రాజశేఖర్స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్టు ఈసీ వెల్లడించింది.
రెండో రోజు 37 నామినేషన్లు దాఖలు
రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. తెదేపా, వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో స్వతంంత్ర అభ్యర్థులూ నామినేషన్ల వేయడానికి పోటీపడ్డారు.
గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి భాజపా అభ్యర్థి చిలుకూరి రామ్‌కుమార్ నామినేషన్ వేశారు. గన్నవరంలో నేలపూడి స్టాలిన్ బాబు తెదేపా తరఫున నామినేషన్ దాఖలుచేశారు. మండపేట, రాజమహేంద్రవరం గ్రామీణానికి ఇద్దరు ఇండిపెండెంట్లు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. జగ్గంపేట నుంచి వైకాపా అభ్యర్ధి జ్యోతుల నాగ వెంకటవిష్ణు, విజయవాడ తూర్పు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవరంగ్, పశ్చిమ నుంచి మరో ఇండిపెండెంట్ నామినేషన్ వేసినట్టు ఈసీ తెలిపింది.
మంగళగిరి, వేమూరు, తెనాలి, బాపట్ల, గుంటూరు పశ్చిమ, చిలకలూరిపేట, సత్తెనపల్లి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల నుంచి సతీష్ కుమార్ రెడ్డి, సుమతీ రెడ్డి తెదేపా తరఫున నామినేషన్లు వేశారు.జమ్మలమడుగు, పాణ్యం,నంద్యాల, రాప్తాడు,హిందుపురం, పుట్టపర్తి, తంబళ్లపల్లి, తిరుపతి, నగరి నుంచి ఇండిపెండెంట్లు నామినేషన్లు సమర్పించారు. కల్యాణదుర్గం నుంచి వైకాపా అభ్యర్థి జి.గోవిందరాజులు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు.