పర్యాటక బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తాం
సచివాలయం మూడో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు మంత్రి అవంతి శ్రీనివాస్. పర్యాటక కార్పొరేషన్ తరహాలో ఆర్కియాలజీ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తూ తొలి సంతకం చేశారు. అతిథి దేవోభవ నినాదంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. 13 జిల్లాల్లోని పర్యాటక ప్రదేశాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏకగవాక్ష పద్ధతిలో అనుమతులిస్తామని...ఏపీ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్‌ను నియమిస్తామని పేర్కొన్నారు.
బాధ్యతలు స్వీకరించిన బాలినేని, అవంతి, ధర్మాన - మంత్రులు
ఇవాళ మరికొందరు మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. తమకు కేటాయించిన ఛాంబర్లతో ఛార్జ్ తీసుకున్నారు. ప్రాధాన్య దస్త్రాలపై సంతకాలు చేశారు.
పీపీఏలు సమీక్షిస్తాం
సచివాలయం రెండో బ్లాకులోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి 2 కమిటీలు ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారాయన. గతంలో వైఎస్, ఇప్పుడు తనయుడు వద్ద మంత్రిగా పనిచేయడం ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు. పగటిపూట రైతులకు విద్యుత్ సరఫరా చేసే దిశగా అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్ రాయితీ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
రెండేళ్లలో అనంత- అమరావతి ఎక్స్‌ప్రెస్ వే
సచివాలయం ఐదో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో అడుగుపెట్టిన కృష్ణదాస్... ఎన్డీబీ ప్రాజెక్టుకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేశారు. దుర్గ గుడి పైవంతెన నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండేళ్లల్లో అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే పూర్తి చేస్తామన్నారు.