ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఆత్మహత్య చేసుకుంటారని... కాపలా ఉంటున్నాం

తెలంగాణ ఇంటర్​ ఫలితాల అవకతవకలపై  ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫెయిలైన విద్యార్థులు మనస్తాపంతో ఎక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతారో అనే భయం వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

By

Published : Apr 25, 2019, 7:41 PM IST

parentsworry about their children

ఆత్మహత్య చేసుకుంటారని... కాపలా ఉంటున్నాం

తెలంగాణలో ఇంటర్ ఫలితాల వ్యవహారంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అన్యాయాన్ని నిరసిస్తూ... హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళనలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు... తమ పిల్లల బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్న ఆందోళన ఓ వైపు ఉంటే... మనస్తాపంతో ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడుతారో అనే భయం మరోవైపు వేధిస్తోంది.

కాపలా ఉంటున్నాం

ఇప్పటికే సుమారు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలు బాగా రాసినా ఫెయిల్ అయ్యారని మనస్తాపంతో తమ పిల్లలు కూడా బలవన్మరణానికి పాల్పడుతారేమోనని... కాపలా ఉంటున్నామని ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎంసెట్ పై ప్రభావం

బోర్డు నిర్లక్ష్యానికి తాము ఇక్కడికి వచ్చి ఆందోళనలు చేయాల్సిన అవసరం ఏంటని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంతో తమ పిల్లలు మానసిక క్షోభకు గురవుతున్నారని... ప్రవేశ పరీక్షలకూ సన్నద్ధం కాలేక పోతున్నారని అంటున్నారు. తక్కువ మార్కులు రావడం వల్ల ఎంసెట్​లో వెయిటెజ్​పై ప్రభావం పడి నష్టపోతామని... మంచి కళాశాలలో సీటు రాదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

పోరాడుదాం రా...

మార్కులే జీవితం కాదు... ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకోవడం సమంజసం కాదు... న్యాయం కోసం పోరాడుదామని తోటి విద్యార్థులు పిలుపునిస్తున్నారు. ఏడాది కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థులకు... బోర్డు తప్పిదాల వల్ల వచ్చిన మార్కులు చూసి ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం కావాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details