ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ఈ కారుకు గుర్రమే ఇంజిన్​

మంచులో ప్రయాణానికి రష్యాలో ఓ ఉపాధ్యాయుడు జట్కా కారును రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

రష్యాలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'గుర్రపు కారు' తయారీ

By

Published : Feb 9, 2019, 12:28 PM IST

రష్యాలో ప్రపంచంలోనే మొట్టమొదటి 'గుర్రపు కారు' తయారీ
ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా ఒక్కోసారి పాతతరం ఉపకరణాలనే వాడాల్సి వస్తుంది. రష్యాలో ఇదే జరిగింది. చెర్కాసోవో ప్రాంతంలో మంచు భారీగా కురుస్తోంది. హిమపాతంలో వాహనాలు వెళ్లడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మంచులో వాహనాలు కూరుకుపోయాయంటే అంతే! ఈ సమస్యను పాత తరం సాంకేతికతతో అధిగమించారు రష్యాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు ఐవాన్​ మెల్నికోవ.

ప్రపంచంలోనే మొట్టమొదటి 'గుర్రపు కారు'ను తయారు చేశారు. తన ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్లడానికి ఈ గుర్రపు కారునే వినియోగిస్తున్నారు. సుమారు 10 కిలోమీటర్ల వరకు తన ప్రయాణాలను ఇందులోనే కొనసాగిస్తున్నారు.

ఇందులో గేర్​బాక్స్​, స్టీరింగ్​, ఇంజిన్​ ఉండవు. కారు నడవటానికి పెట్రోలు పోయాల్సిన అవసరమూ లేదు. ఇది గుర్రం సాయంతోనే నడుస్తుంది. కారులో వెచ్చదనం కోసం హీటర్​, వినోదం కోసం మ్యూజిక్​ ప్లేయర్​ ఏర్పాటు చేసుకున్నారు.

"నేను కజాన్ నగరంలో ఉన్నప్పుడు క్యాథరిన్ అనే సరుకు రవాణా బండిని చూశాను. అది ఇరుసులతో తయారు చేసినది. అప్పుడే కారుకు ఇరుసులు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నా. నా స్నేహితుడి నుంచి మాస్కోవిచ్​ కారును కొనుగోలు చేశాను. అందులోని ఇంజిన్​ తొలగించి ఇరుసులు ఏర్పాటు చేస్తానని అతనితో ఒప్పందం చేసుకున్నాను. అలా నా గుర్రపు కారు తయారైంది. నేను పాఠశాలకు వెళ్లడానికి దీనిని తయారు చేసుకున్నాను. "
- ఐవాన్​ మెల్నికోవ, కారు తయారీదారు

ప్రస్తుతం గుర్రపు కారుతో మెల్నికోవ ఒక సెలబ్రిటీ అయిపోయారు. వారి గ్రామంలో ఉన్న ఒకే ఒక గుర్రం 'నాచ్కో'తో కారు నడపటాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల వారూ వస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details