దిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్ష విరమించారు. మాజీ ప్రధాని దేవేగౌడ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు
దిల్లీలో ధర్మపోరాటం : లైవ్ అప్ డేట్స్
2019-02-11 20:23:13
విజయవంతంగా ముగిసిన దీక్ష
2019-02-11 20:19:00
మోదీ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు : చంద్రబాబు
మోదీ సర్కారు విపక్ష నేతలను ఎన్నో బాధలు పెట్టిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారనే కలిసి పోరాటం చేస్తున్నామన్నారు. జాతీయ మీడియాను మోదీ నియంత్రిస్తున్నారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను చూపించి భయపెడుతున్నారని విమర్శించారు
2019-02-11 20:05:39
చలిలో కష్టపడ్డారు : ఫరూక్ అబ్దుల్లా
దీక్ష చేసిన వారికి ఫరూక్ అబ్దుల్లా ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఏపీ ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాలన్నీ ప్రగతిబాటలో నడిస్తేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.
2019-02-11 19:57:10
దీక్షకు మద్దతిచ్చిన మల్లికార్జున్ ఖర్గే
దేశంలోని ప్రతి వ్యవస్థనూ మోదీ నాశనం చేశారని ఖర్గే మండిపడ్డారు. ఏపీకి కేంద్రం ఎలాంటి సాయం చేయలేదన్నారు. పటేల్ విగ్రహానికి 3000 కోట్లిచ్చి... అమరావతి నిర్మాణానికి భాజపా ఎంతిచ్చిందని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకిచ్చిన నిధులు వెనక్కు తీసుకోవడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు. ఏపీకి అన్యాయం జరిగిందని అన్ని పార్టీలు భావిస్తున్నాయన్నారు.
2019-02-11 19:33:38
ధర్మపోరాట దీక్షలో చంద్రబాబు ముగింపు ప్రసంగం
ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన నేతలకు ఐదు కోట్ల తెలుగువాళ్ల తరపున చంద్రబాబు ధన్యావాదాలు తెలిపారు. దీక్షకు దేశమంతా సంఘీభావం తెలపడంతోనే నైతిక విజయం సాధించామని వెల్లడించారు. విభజన చట్టం హామీల అమలు కోసమే దీక్ష చేశామన్నారు. మోదీ అండ్ కో తప్ప అందరూ మద్దతు తెలిపారని దుయ్యబట్టారు. అమరావతిలో భారీ స్థాయిలో ధర్మపోరాట దీక్ష చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు.
"ఏపీకి జరిగిన అన్యాయం దేశవ్యాప్తంగా చాటిచెప్పాం. రేపు రాష్రపతిని కలిసి ఏపీ డిమాండ్లు తెలియజేస్తాం. మోదీకి గౌరవం ఇచ్చినా నిలబెట్టుకోలేదు. తప్పును సరిదిద్దుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నా. మేము ఒంటరిగా లేము. దేశం మాకు తోడుగా ఉంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మా సమస్య తీరుతుంది. మా రాష్ట్రానికి మద్దతిచ్చిన నాయకుల రుణం నేను, మా రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. మీరున్నారన్న ధైర్యం మా కొచ్చింది."- చంద్రబాబు
ప్రత్యేక హోదా కోసం అర్జున్ రావ్ ఆత్మహత్య చేసుకోవడం బాధగా ఉందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అధైర్య పడవద్దని సూచించారు. హక్కుల సాధనలో రాజీలేని పోరాటం చేస్తామన్నారు. అర్జున్ రావ్ కుటుంబానికి చంద్రబాబు 20 లక్షల పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు చేయనున్నట్లు వెల్లడించారు.
2019-02-11 19:08:49
ఏపీ ప్రత్యేక హోదా మా హక్కు : చలసాని శ్రీనివాస్
హోదా పోరులో కీలక సమయం ఆసన్నమైందని హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. కులం, మతం, ప్రాంతాలను రెచ్చగొట్టాలని చూస్తే అన్ని చోట్లా చెల్లదని భాజపాను వారించారు.
"తెలుగు వాళ్లకు సహనం ఎక్కువ. కలిసి పోరాడితే నిలబడతాం... లేకుంటే పడిపోతాం. దేశానికి అన్నం పెట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్కుంది. ప్రత్యేక హోదా మా హక్కు. "- చలసాని శ్రీనివాస్
2019-02-11 18:41:12
చంద్రబాబుతో దీక్ష విరమింపజేయనున్న దేవెగౌడ, ఫరూక్ అబ్దుల్లా
- ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షను దేవే గౌడ, ఫరూక్ అబ్దుల్లా విరమింపజేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఈ దీక్ష కొనసాగుతుంది.
- రేపు ఉదయం 10 గంటలకు ఏపీ భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు
2019-02-11 18:27:36
బాబుకు మద్దతు తెలిపిన శతృఘ్న సిన్హా, మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా
ఇవాళ దేశంలో చంద్రబాబు హీరో అయ్యారని శతృఘ్న సిన్హా కితాబిచ్చారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదని, పార్టీ కంటే దేశం గొప్పదన్నారు. మోదీ వ్యాఖ్యలకు చంద్రబాబు దీటుగా జవాబిచ్చారని వెల్లడించారు. చౌకీదారు ఏం చేస్తున్నారో దేశ ప్రజలకు తెలుసన్నారు.
2019-02-11 18:10:25
చంద్రబాబు సారథ్యంలో ఏపీకి హోదా సాధిస్తాం : నటుడు శివాజీ
దిల్లీ ధర్మపోరాట దీక్ష వేదికగా మోదీ పై నటుడు శివాజీ మండిపడ్డారు. మోదీ గో బ్యాక్ అంటే గుజరాత్ లో టీ దుకాణం పెట్టుకోమని వివరించారు. ఏపీకి మోదీ కియా మోటార్స్ తెచ్చామనడం దారణమన్నారు. చంద్రబాబు సారథ్యంలో అద్భుతమైన అమరావతి చాస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ ఉడుత ఊపులకు భయపడమన్నారు.
2019-02-11 17:47:52
చంద్రబాబు దీక్షకు మద్దతు పలికిన దిగ్విజయ్ సింగ్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ధర్మపోరాట దీక్షకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతు పలికారు. భాజపాను తాను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాని, ఆ పార్టీని నమ్మలేమని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికైనా భాజపా నుంచి బయటకొచ్చి మంచి పని చేశారన్నారు.
2019-02-11 16:25:50
ధర్మపోరాట దీక్షకు మధ్యప్రదేశ్ సీఎం సంఘీభావం
కేంద్రం చేసిన మోసానికి చంద్రబాబు పోరాటం చేస్తున్నారని కమల్‌నాథ్ అన్నారు. ధర్మపోరాట దీక్షాస్థలికి వచ్చి కమల్‌నాథ్ మద్దతు ప్రకటించారు. మోదీ పాలనతో సీబీఐ, ఆర్బీఐలోనే కాదు సమాజంలోనే చీలిక వచ్చిందన్నారు.
2019-02-11 15:55:58
దేశాన్ని కాపాడుకునే ఆశయ సాధనలో రాజీ లేదు: చంద్రబాబు
మోదీ, అమిత్ షా కలిసి దేశంలోని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు పెట్టారని పేర్కొన్నారు. మోదీ పాలనలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తిరగబడుతున్నారన్నారు. భాజపాలో సైతం గొడవలు పెట్టిన ఘనత మోదీ అని విమర్శించారు. విభజన చట్టం అమలు చేయకుండా రాష్ట్రాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా ఇస్తామని చెప్పి ఇన్నాళ్లూ మోసం చేశారని పునరుద్ఘాటించారు.
2019-02-11 15:11:53
మోదీ లాంటి ప్రధానిని ఎప్పుడూ చూడలేదు:ఆజాద్
సుమారు 40 ఏళ్ల తర్వాత ఆంధ్రాభవన్‌కు ప్రత్యేక కళ వచ్చిందని గులాం నబి ఆజాద్ అన్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఏపీ భవన్‌కు వచ్చారు. చంద్రబాబు తనకు మధ్య 28 ఏళ్ల నుంచి పరిచయం ఉందని ఆజాద్ అన్నారు. మోదీ పాలనలో దేశం నలుమూలలా రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. అయినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోదీ లాంటి ప్రధానిని గతంలో చూడలేదని.. భవిష్యత్తులో చూడబోం అని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.
2019-02-11 14:52:04
ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో ఏపీకి ఇచ్చిందేమీ లేదు: శరద్ పవార్
దిల్లీలో చంద్రబాబు ధర్మపోరాటదీక్షకు ఎన్. సీ.పీ అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రూ.వేల కోట్లు నష్టం వచ్చిందని శరద్ పవార్ తెలిపారు. రాష్ట్రానికి ఇస్తామన్న ఆర్థిక లోటు కేంద్రం భర్తీ చేయలేదన్నారు. ఇస్తామన్న పరిశ్రమల హామీ నెరవేర్చలేదన్నారు. ఐదేళ్ల ఎన్డీఏ పాలనలో ఏపీకి ఇచ్చిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ఆవేదనలో ఉన్న ఆంధ్రా ప్రజలు ... మోదీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని శరద్ పవార్ హెచ్చరించారు.
2019-02-11 13:19:10
అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట- కేజ్రీవాల్
చంద్రబాబు దీక్షా శిబిరానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ వచ్చారు. ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోదీ మోసం చేశారన్నారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ దిట్ట అని ఎద్దేవా చేశారు. తిరుపతి వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి అమలు పరచట్లేదన్నారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ఆప్ మద్దతుగా ఉంటుందని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఒక పార్టీకి కాదు... దేశానికి ప్రధాని అని మోదీ మరిచిపోయినట్లున్నారని ఆరోపించారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తారని మోదీపై ధ్వజమెత్తారు.
2019-02-11 13:10:06
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా : చంద్రబాబు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ ప్రకటించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. ఏపీకి మోదీ చేస్తున్న అన్యాయాన్ని దేశ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు.
2019-02-11 12:57:40
ఇచ్చిన హామీలకు అతీగతీ లేకుండా పోయింది : జైరాం రమేష్
విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో కేంద్రం నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. రాజ్యసభ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ధ్వజమెత్తారు. ఆనాడు వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు... ప్రత్యేక హోదా పదేళ్లని చెప్పారని గుర్తుచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీయే కదా? అని ప్రశ్నించారు. పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలకే అతీగతీ లేకుండా పోయిందని జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
2019-02-11 12:52:45
చంద్రబాబుకు డీఎంకే అండ
చంద్రబాబు పోరాటానికి డీఎంకే అండగా ఉంటుందని డీఎంకే ఎంపీ శివ తెలిపారు. కృష్ణా-గోదావరి అనుసంధానం చేసి చంద్రబాబు గొప్ప ఖ్యాతిని పొందారన్నారు. చంద్రబాబు పాలనను సామాజిక మాధ్యమం వేదికగా ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి ఓటమి తప్పదని హెచ్చరించారు.
2019-02-11 12:42:36
మద్దతు ఇస్తున్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు:సీఎం
జాతీయ నాయకులంతా వచ్చి తమ దీక్షకు సంఘీభావం తెలుపుతున్న ప్రతిఒక్కరికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తాను చేసే పనిలో న్యాయం ఉందని అందరూ చెప్పారని అన్నారు. విభజన హామీలు నెరవేర్చేవరకు అందరూ ఉండగా ఉంటామని జాతీయ నేతలు హామీ ఇస్తున్నారని చంద్రబాబు చెప్పారు.
2019-02-11 12:02:35
దీక్షా శిబిరానికి ములాయం సింగ్ యాదవ్
చంద్రబాబు దీక్షా శిబిరానికి ములాయం సింగ్ యాదవ్ వచ్చారు.. ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వెల్లడించారు.
2019-02-11 11:56:28
చంద్రబాబు దీక్షకు మమతా మద్దతు
చంద్రబాబుతో ఫోనులో మాట్లాడిన మమతా బెనర్జీ... ధర్మపోరాట దీక్షకు సంఘీభావం.
2019-02-11 11:28:53
చంద్రబాబుకు మన్మోహన్‌సింగ్ మద్దతు
చంద్రబాబు దీక్షా శిబిరానికి వచ్చిన మన్మోహన్‌సింగ్... ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన మాజీ ప్రధాని
భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చిందని మన్మోహన్ అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందిని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిందేనని గుర్తుచేశారు. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయన్నారు.
2019-02-11 11:03:03
ప్రజలకు ఇచ్చిన హామీని ప్రధాని పెడచెవిన పెట్టారు- రాహుల్ గాంధీ
చంద్రబాబు దీక్షా శిబిరానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వచ్చారు. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపిన రాహుల్‌గాంధీ. ప్రధానిగా దేశ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలా...వద్దా అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని పెడచెవిన పెట్టారని విమర్శించారు. దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే అదీ తూ.చ. తప్పకుండా అమలు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో భాగంకాదా...అని ప్రశ్నించారు. ప్రధాని ఎక్కడికెళ్తే అక్కడి పాటే పాడతారని ఎద్దేవా చేశారు. ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండానే అబద్ధాలు చెబుతారని విమర్శించారు. ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదని...ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల నిధులను దోచి అంబానీకి కట్టబెట్టారాని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
2019-02-11 10:35:32
దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ ప్రభుత్వం పోవాలి- ఫరూక్ అబ్దుల్లా
దిల్లీలో చంద్రబాబు దీక్షా శిబిరానికి ఫరూక్ అబ్దుల్లా వచ్చారు. ముఖ్యమంత్రి పోరాటానికి మద్దతు తెలిపారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదేని తెలిపారు. ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుందన్నారు. కేంద్రం ధర్మం తప్పినందునే ఆంధ్రా ప్రజలు దిల్లీ వరకు వచ్చారని ఫరూక్ తెలిపారు. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి పాలించాలని చూస్తున్నారని అన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలన్నారు. వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదు ఎన్ సీ నేత ఫరూక్ అబ్దుల్లా తెలిపారు.
2019-02-11 10:30:46
ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు: మంత్రి కాలవ శ్రీనివాసులు
కేంద్రం విభజన హామీల్లో ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఇచ్చిన హమీలు నెరవేర్చాలనేదే తమ ప్రధాన డిమాండ్ మంత్రి స్పష్టం చేశారు.
2019-02-11 09:35:58
బాధ్యతను విస్మరిస్తే కుదరదు: చంద్రబాబు
హక్కుల కోసమే పోరాడుతున్నామని మోదీ గుర్తుంచుకోవాలని చంద్రబాబు అన్నారు. తాము ఈ దేశంలో భాగమేనని... వివక్ష చూపితే మీ ఆటలు సాగవని హెచ్చరించారు. కేంద్ర పెద్దలు లెక్కలు అడుగుతున్నారని...కేంద్రానికి పన్నులు కట్టిన దానిపై లెక్కలు చెప్పండని ప్రశ్నించారు. కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన సాగాలని సూచించారు. ఇష్టప్రకారం చేస్తామంటే ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. బాధ్యతను విస్మరించి ఇష్టానుసారం చేస్తామంటే కుదరదుని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఐదు కోట్లమంది ప్రజలు,భావితరాల భవిష్యత్ కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు.
2019-02-11 09:15:42
వివక్ష చూపినప్పుడు పోరాడాల్సిందే: చంద్రబాబు
ఒక రాష్ట్రం పట్ల వివక్ష చూపినప్పుడు న్యాయం కోసం పోరాడాల్సిందేనని చంద్రబాబు అన్నారు. పరిపాలించే వ్యక్తులు ధర్మాన్ని పాటించనప్పుడు తాము పోరాడాల్సిందేనిని స్పష్టం చేశారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు పరిష్కరించలేదని...ఈ సమయంలో నిలదీయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విభజన సమయంలో ఇచ్చిన ఏఒక్క హామీ నెరవేర్చలేదని తెలిపారు. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు చెప్పారని... వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని అడిగారని గుర్తుచేశారు. ఇంతవరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఏపీకి అన్యాయం చేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకునే పరిస్థితికి వచ్చారని కేంద్రం పై మండిపడ్డారు.
2019-02-11 09:03:34
దీక్షా శిబిరానికి రానున్న రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా
ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేపట్టారు. రాహుల్‌గాంధీ, ఫరూక్ అబ్దుల్లా మరి కాసేపట్లో దీక్షా శిబిరానికి రానున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కేజ్రీవాల్ దీక్ష శిబిరానికి వచ్చి తమ మద్దతు తెలుపనున్నారు.
2019-02-11 08:57:36
హక్కులకోసమే పోరాటం : సుజనా
ఏపీకి రావాల్సిన హక్కులనే కోరుతున్నామి తెదేపా ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. చట్టంలో పొందుపరిచినవే అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం చిన్నచూపు చూస్తోందని... సంఘీభావం తెలిపేందుకు చాలామంది నేతలు వస్తున్నారన్నారు. ప్రధాని తన స్థాయి దిగజారి విమర్శలు చేస్తున్నారన్నారు.
2019-02-11 08:33:33
దిల్లీలో ధర్మపోరాటం : లైవ్ అప్ డేట్స్
దిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ప్రారంభమైంది. ప్రముఖులకు నివాళులర్పించిన అనంతరం సీఎం దీక్ష ప్రారంభించారు. వేదికపై గాంధీ,అంబేడ్కర్, ఎన్టీఆర్ చిత్రపటాలకు నివాళులర్పించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయనందుకు నిరసనగా సీఎం దీక్ష చేస్తున్నారు. ఏపీ భవన్‌లో రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగనుంది. ధర్మపోరాట దీక్షకు పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు హాజరైయ్యారు. చంద్రబాబుకు సంఘీభావంగా దీక్షలో ఎన్జీవో సంఘాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. దీక్ష కోసం రాష్ట్రం నుంచి ప్రజానీకం వేలాదిగా తరలివచ్చారు.