కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తోందని, రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు ముక్తకంఠంతో నినదించాయి. లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి సీబీఐ, కేంద్రానికి వ్యతిరేకంగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. సభాపతి ఎన్నిసార్లు వారించినప్పటికీ సభ్యులు లెక్కచేయలేదు.
విపక్షాలు లేకుండా చేయాలనే: ఖర్గే
సీబీఐ వ్యవహారంపై కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. విపక్షాలను అంతం చేయడానికే కేంద్రం సీబీఐని వినియోగిస్తోందని దుయ్యబట్టారు.
"ఈ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోంది. ప్రతిపక్షాలను మట్టుపెట్టి నిరంకుశ ప్రభుత్వాని నడపొచ్చని చూస్తున్నారు. బంగాల్లో వారి ఆటలు సాగవనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. అర్ధరాత్రి వెళ్లి పోలీసు అధికారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఒక్క పోలీసు అధికారిని అరెస్ట్ చేయడానికి 40 మంది అధికారులు వెళ్లడం ఏంటి? దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? బంగాల్లోనే కాదు, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక, చెన్నైలోనూ ఇదే రీతిలో వ్యహరించారు. రాజ్యాంగ సంస్థలను ప్రజలకు ఉపయోగపడేలా కాకుండా ప్రతిపక్షాలను నాశనం చేయడానికి వినియోగిస్తోంది కేంద్రం. " - మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత