SC On Mineral Tax : ఖనిజాలు, గనులు కలిగిన భూములపై రాయల్టీ విధించే హక్కు రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 8:1 నిష్పత్తితో విస్తృత ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రాజ్యాంగం ప్రకారం గనులు ఖనిజాల నియంత్రణ, అభివృద్ధిపై పార్లమెంటుకు అధికారం లేదని పేర్కొంది.
'ఖనిజాలు, గనులపై రాయల్టీ విధించే అధికారం రాష్ట్రాలదే'- సుప్రీం చారిత్రక తీర్పుతో కేంద్రానికి ఎదురుదెబ్బ
Published : Jul 25, 2024, 1:48 PM IST
గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 ప్రకారం ఖనిజాలపై రాయల్టీని పన్నుగా పేర్కొనవచ్చని, దీనిపై పార్లమెంటుకు అధికారముందని మైనింగ్ కంపెనీల తరఫున న్యాయవాది హరీశ్ సాల్వే వాదించారు. 1989లో ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం కేసులో ఏడుగురు సభ్యుల ధర్మాసనం రాయల్టీని పన్నుగా గుర్తించవచ్చని తీర్పునిచ్చింది. 2004లో బంగాల్ ప్రభుత్వం వర్సెస్ కేశోరాం ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేసు తీర్పులో రాయల్టీ పన్ను కాదని స్పష్టంచేసింది. అప్పట్లో ఈ వివాదాన్ని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కోర్టు నివేదించింది. దానిపైనే ఇప్పుడు తీర్పు వెలువడింది.