మూడు రోజులకు ఒక్కసారైనా నీళ్లు రావడం లేదు - మంత్రి బుగ్గనను నిలదీసిన జనం - Minister Buggana Faced Protest - MINISTER BUGGANA FACED PROTEST
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 1:39 PM IST
Minister Buggana Faced Protest in Dhone : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మంత్రి బుగ్గనకు నిరసన సెగ తగిలింది. సుందర్‌సింగ్ కాలనీలో ప్రచారానికి వెళ్లిన బుగ్గనను రోడ్లు, తాగునీటి సమస్యపై స్థానికులు నిలదీశారు. తాగునీటి పైప్‌లైన్ లీకై నీరు కలుషితమవుతోందని, మూడు రోజులకు ఒక్కసారైనా నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్లే ట్యాంకర్లతో నీళ్లు పంపుతున్నారని స్థానికులు మంత్రికి తెలిపారు. కాలనీలోని చేతి పంపును కూడా బాగు చేయలేదని, తామే చందాలు వేసుకుని రిపేరు చేయించుకున్నాని వాపోయారు.
సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మంత్రి నిర్లక్ష్య వైఖరికి ప్రజలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు చేస్తాం, అప్పుడు చేస్తాం అంటూ ఇంకెప్పుడు చేసేది అంటూ నిలదీశారు. రోడ్లు, తాగు నీటి సమస్యతో సతమతమవుతుంటే పట్టించుకోని వాళ్లు ప్రచారాల కోసం వస్తున్నారని ధ్వజమెత్తారు. తాగు నీటి సమస్య పరిష్కరించాలని కోరారు.