YSRCP Leaders Fake Form 7 Applications: రాష్ట్రంలో తటస్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపునకు తప్పుడు ధ్రువీకరణలు, సమాచారంతో ఫాం-7 దరఖాస్తులు చేసిందీ, చేయించిందీ వైసీపీ వారేనని తేటతెల్లమైంది. ఎన్నికల అధికారుల ఫిర్యాదుల మేరకు తప్పుడు ఫాం-7ల వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో 70 కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధిక కేసుల్లో వైసీపీ నాయకులే నిందితులు. వారిని వెనక నుంచి నడిపిస్తున్నదెవరు? ఎవరి ఆదేశాల మేరకు వారు తప్పుడు ఫాం-7 దరఖాస్తులు చేశారు ? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోతోంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫాం-7 దరఖాస్తుల కుట్రలో, 42వ డివిజన్ వైసీపీ ఇంఛార్జి చల్లా శేషారెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. ఆయనతో పాటు వైసీపీ బూత్ ఏజెంట్లుగా పనిచేస్తున్న కొండా శేషారెడ్డి, ఎల్.రాము, వైసీపీ నాయకుడు పులుసు వెంకటరెడ్డి, సిద్ధి వెంకాయమ్మలపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. మూడు రోజుల్లో 979 మంది ఓట్ల తొలగింపునకు వారు నకిలీ ఫాం-7లు పెట్టారు. అందులో 939 మంది అర్హులేనని విచారణలో తేలింది.
'ఫాం 7 దరఖాస్తుల పరిశీలన' 80శాతం బోగస్! - విచారణకు మొహం చాటేస్తున్న వైసీపీ సానుభూతిపరులు
తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అర్హుల ఓట్ల తొలగింపునకు గతంలో వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరించిన దువ్వాడ వాణి వ్యక్తిగత కార్యదర్శి చింతాడ సాయికుమార్‌తో పాటు వైసీపీ నాయకులు ఏదూరు రాజశేఖర్, వాన రాము, కణితి మురళి నకిలీ ఫాం-7లు పెట్టారు. 60కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓట్ల తొలగింపునకు వీరు వందల ఫాం-7 దరఖాస్తులు పెట్టడంతో నందిగాం, కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లలో మోసం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31ఏ కింద వీరిపై రెండు కేసులు నమోదయ్యాయి.
కాకినాడ నగర నియోజకవర్గంలో నకిలీ ఫాం-7లకు సంబంధించి 23 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 50 మందికి పైగా నిందితులుంటే.. ఎక్కువమంది వైసీపీ కార్యకర్తలే. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అధికారపార్టీ ముఖ్యనేత ఆధ్వర్యంలోనే తప్పుడు దరఖాస్తుల దందా సాగింది. పది కేసులు నమోదైనా ఒక్క దానిలోనూ కీలకనేతను నిందితుడిగా చేర్చలేదు.