YSRCP Government has Disabled Building Workers Welfare Board :కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబం మొత్తం వీధిన పడుతుంది. అలాంటి వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందితే ఉపయుక్తంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న సంక్షేమ బోర్డును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నిధులను దారిమళ్లించి కార్మికుల పొట్టగొట్టింది. కూటమి ప్రభుత్వమైన తమ గోడును పట్టించుకుని సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికులు కోరుతున్నారు.
భవన నిర్మాణ కార్మికులు పనిప్రదేశాల్లో నిత్యం ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికం. అలాంటి వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని తీసుకొచ్చారు. 110 రూపాయలు చెల్లించి కార్మికులు పేరును నమోదు చేసుకోవాలి. మళ్లీ ఐదేళ్ల తర్వాత 60 రూపాయలు చెల్లించి రెన్యూవల్ చేసుకోవాలి. పనిప్రదేశంలో కార్మికులు ప్రమాదవశాత్తూ మృతి చెందినా, పూర్తి అంగవైకల్యం పొందిన 5 లక్షల రూపాయలను బోర్డు నుంచి పరిహారంగా అందించేవారు.
కార్మిక సంక్షేమ బోర్డులో నమోదుతో అనేక ప్రయోజనాలు
50 శాతం అంతకుమించి అంగ వైకల్యం కలిగిన వారికి రూ. లక్ష చెల్లిస్తారు. అలాగే 26 నుంచి 49 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి రూ.50 వేలు, 25 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి రూ.25 వేలు పొందేందుకు అర్హత ఉంటుంది. సాధారణంగా మృతి చెందిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం వివాహితకు ప్రసూతి సాయం కింద రూ.20 వేలు అందజేసేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్మికులు నుంచి రుసుములు వసూలు చేయడం మినహా మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు క్షతగాత్రులకు భీమా చెల్లింపులు చేపట్టలేదు.
'భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు ఇతర శాఖలకు మళ్లించొద్దు'
ఉమ్మడి కృష్ణా జిల్లాలో భవన నిర్మాణ రంగం అనేక మందికి ఉపాధి కల్పించడంలో క్రియాశీలక పాత్ర వహిస్తోంది. జిల్లాలో 2లక్షల 18వేల 340 మంది భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకున్నారు. నమోదు చేసుకోనివారు మరో రెండు లక్షల మందికి పైగా ఉంటారని కార్మిక సంఘాల అంచనా. జగన్ పాలనలో వివిధ కారణాలతో 387 మంది భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ప్రమాదానికి గురైన, మృతి చెందిన సంక్షేమ బోర్డు నుంచి పరిహారం అందించేవారు. వైఎస్సార్సీపీ పాలనలో సంక్షేమ బోర్డు నిధులను ఇతర అవసరాలకు మళ్లించి కార్మికుల ప్రయోజనాలను కాలరాశారు. కూటమి ప్రభుత్వం తిరిగి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి అండగా నిలవాలని కార్మికులు కోరుతున్నారు.
ప్రతి ఒక్క అర్హుడికి పింఛన్ అందాలి - విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం - Chandrababu Review on Pensions