YS Sharmila Fires On Jagan Mohan Reddy On Twitter :నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించే జగన్‌కి, అసెంబ్లీకి వెళ్లేందుకు ముఖం చెల్లదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. అసెంబ్లీకి వెళ్లని వైఎఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యల మీద మాట్లాడే నైతికత లేదన్నారు. జగన్ ప్రెస్ మీట్లు పెట్టి పురాణం అంతా చెప్పే తీరిక దొరుకుతుంది, కానీ అసెంబ్లీలో పాలకపక్షాన్ని నిలదీసే ధైర్యం లేదన్నారు. జగన్ పై ఎక్స్ వేదికగా షర్మిల విమర్శలు గుప్పించారు.
వెంటనే రాజీనామాలు చేయాలి : ప్రజలు 11 మందిని గెలిపిస్తే శాసనసభకు రాకుండా నీతుల చెబుతున్నారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజల మధ్య తిరిగే అర్హత లేదని ఆక్షేపించారు. ఈ సారి కూడా అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేకుంటే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామాలు చేయాలన్నారు. సూపర్ సిక్స్ పథకాలపై సీఎం చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ షర్మిల రెడ్డి డిమాండ్ చేశారు. బడ్జెట్లో సూపర్ సిక్స్ పథకాలకు అగ్రభాగం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని పథకాలను ఈ ఏడాది నుంచే అమలు చేయాలని సూచించారు.