YCP Leaders Attacked on CM Ramesh Convoy :ప్రశాంతంగా ఉండే ఉత్తరాంధ్రలో వైసీపీ అరాచక శక్తులు దౌర్జన్యకాండకు దిగాయి. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి స్వగ్రామంలో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేశ్‌పై మూకదాడికి పాల్పడ్డారు. పోలీసు వాహనంలో వారి రక్షణలో ఉన్న ఎంపీపైనే రాళ్లు, ఇటుకలు విసిరి బీభత్సం సృష్టించారు. సీఎం రమేశ్ చొక్కా చింపేసినా పోలీసులు కేవలం బూడి అనుచరులను బతిమలాడుతూ కనిపించారే తప్ప ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం చూస్తే వైసీపీ అరాచకాలకు పోలీసులు ఎంతగా వంతపాడుతున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రజావ్యతిరేకత బయటపడుతుండటంతో వైసీపీ నేతల్లో అసహనం రోజురోజుకు పెరిగిపోతోంది. దాడులు, ఘర్షణలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం, లోక్‌సభ వైసీపీ అభ్యర్థి బూడి మూత్యాలనాయుడు స్వగ్రామం తారువలో కూటమి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యకర్తలకు అండగా నిలిచేందుకు అక్కడికి వెళ్లిన అనకాపల్లి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పైనా వైసీపీ అల్లరి మూకలు దాడికి యత్నించారు.
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి స్వగ్రామం తారువలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డ్రోన్‌తో బీజేపీ కార్యకర్తలు జెండా ఎగురవేశారు. అక్కడున్న డిప్యూటీ సీఎం, ఆయన అనుచరులు డ్రోన్ ఆపరేటర్లతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. డ్రోన్‌ను పగలగొట్టారు. ఆపరేటర్లు, బీజేపీ కార్యకర్తల కారు టైర్లలో గాలి తీసేశారు. బైక్‌లను అడ్డగించి చౌడవాడకు చెందిన బీజేపీ కార్యకర్త కొమర అప్పారావుపై చేయిచేసుకున్నారు. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం బూడి బావమరిది, బీజేపీ కార్యకర్త అయిన గంగాధర్ ఈ దాడిని అడ్డుకోవడానికి యత్నించగా ఆయనపైనా వైసీపీ మూకదాడికి యత్నించింది. దీంతో ఆయన ప్రాణాలు రక్షించుకునేందుకు ముత్యాలనాయుడికి చెందిన పాత ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. ఆ ఇంట్లోనే ముత్యాలనాయుడి మొదటి భార్య కుమారుడు, స్వతంత్ర అభ్యర్థి అయిన రవి ఉంటున్నారు.
ముత్యాలనాయుడు తన అనుచరులతో తలుపులు బద్దలుకొట్టి గంగాధర్‌ను చెప్పుతో కొడుతూ, తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ సమాచారం అందుకున్న దేవరాపల్లి ఎస్సై నాగేంద్ర అక్కడికి వెళ్లి గంగాధర్‌ను కాపాడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ డిప్యూటీ సీఎంపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తాత్సారం చేస్తున్నారంటూ రమేశ్‌తోపాటు తెలుగుదేశం నేత బండారు అప్పలనాయుడు, స్వతంత్ర అభ్యర్థి బూడి రవికుమార్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.