what is ap land titling act:జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేపట్టిన కీలకమైన పనుల్లో ఒకటి, జగనన్న భూ రక్ష. అయితే, ఇది భూ రక్ష కాదు శిక్ష అని ప్రారంభించిన కొన్ని రోజులకే ప్రజలకు అర్థమైంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలనేది దీని ప్రధాన ఉద్దేశం కానీ, శాశ్వత సమస్య లను తెచ్చిపెడుతోంది. సమస్యలే కాదు, ఏకంగా గొడవలతో అన్నదమ్ములు, ఇరుగు పొరుగు వారితో బాహాబాహీకి దిగాల్సి వస్తుంది. తద్వారా ఒక కుటుంబంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడు విరోధలుగా మారుతున్నారు. అయితే, దీనంతటికి కారణం జగన్ సర్కార్ తెచ్చిన భూ రక్ష పథకమే కారణమని రైతులు అంటున్నారు.
AP Land titling act:శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం రీసర్వేలో తీవ్ర గందరగోళం నెలకొంది. 2020 డిసెంబరులో మొదలైన ఈ సర్వే తతంగం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. డ్రోన్ ద్వారా సర్వేతో మొదలుకుని భూ హక్కు పత్రాలు, సరిహద్దు రాళ్లు పాతడం చేస్తారు. 3దశల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17వేల గ్రామాల్లో సర్వే చేస్తారు. అయితే, ఆది నుంచే భూ సర్వే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సమగ్ర రీ సర్వే ద్వారా భూమికి సంబంధించిన డిజిటల్ రికార్డులను నిల్వ చేయడం పథకం ప్రధాన లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డుల్లో పట్టాదారుల వివరాలతో డిజిటల్ మ్యాప్‌లు చేసి తప్పులు లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత సర్వే రాళ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, చాలా చోట్ల ఉన్నఫలంగా అధికారులు సర్వే రాళ్లను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది.
Land titling act 2023:జగనన్న భూరక్ష పథకంలో అధికారులు నిబంధనలకు పాతరేశారు. వారికి ఇష్టం వచ్చినట్టు.. సర్వే చేశారు. భూ యజమానికి సమాచారం ఇవ్వకుండానే.. వారు లేకుండానే కొలతలు వేశారు. ఫలితంగా చాలా గ్రామాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హక్కు పత్రాల్లో పెద్దఎత్తున తప్పులు దొర్లాయి. వీటిని చూసిన రైతులు లబోదిబోమంటున్నారు. తమకు తక్కువ భూవిస్తీర్ణంతో హక్కు పత్రం వచ్చిందని..పత్రంలో అన్ని తప్పులే ఉన్నాయని.. రెండు సర్వే నంబర్లు ఉంటే ఒకే నంబరుతో భూ విస్తీర్ణం వచ్చిందని నలుగురు, ఐదుగురికి కలిపి ఒకే ఎల్పీఎం నంబర్లు ఇచ్చారని.. పేర్లు, చిత్రాలు తప్పుగా ఉన్నాయంటూ ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు అందించారు. అయినా రైతులకు పరిష్కారం చూపించే అధికారి కరవయ్యాడు. దీంతో మిగతా గ్రామాల్లో రైతులు అధికారులను బహిష్కరించారు.
భూ హక్కులకు మడతపెట్టేందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022!
AP Land Registration New Rule:గతంలో భూ వివాదాలు ఉంటే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే సర్వేయర్ వచ్చి కొలతలు వేసి సమస్య పరిష్కరించేవాడు. కానీ, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం ద్వారా భూ సమస్యలను లేని వారు సైతం కొత్త సమస్యలను కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. తద్వారా బంధువులు, రైతులకు రైతులకు మధ్య వైకాపా ప్రభుత్వం చిచ్చు పెట్టినట్టైంది. అటు రీసర్వేలో జరిగిన తప్పిదాలను సవరించేందుకు ఇప్పటివరకు ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. సమస్యలు పరిష్కరించేందుకు రీసర్వే కోసం ఉప తహసీల్దార్లను నియమించామని చెబుతున్నా, వారి స్థాయిలో పరిష్కారం కావడం లేదు. రీసర్వే పూర్తయిన గ్రామాలకు సంబంధించి సవరణలకు ప్రభుత్వం ఆప్షన్ ఇవ్వాల్సి ఉండగా రెండేళ్లు గడిచినా ఇప్పటివరకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమేనని రైతులు వాపోతున్నారు.