Udayagiri Fort in Nellore District:ఎత్తయిన కొండలు, శత్రు దుర్భేద్యమైన కోటలు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కికిలరావాలు, గలగల పారే సెలయేర్లతో తిరుమల గిరులను పోలి ఉంటుంది ఉదయగిరి దుర్గం. పల్లవులు, రాజులు, నవాబులు, ఆంగ్లేయులు ఉదయగిరి కేంద్రంగా పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిత్య కల్యాణం పచ్చ తోరణంలా విరాజిల్లింది. నేటికీ అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో కళకళలాడుతోంది. కానీ సౌకర్యాలు సరిగా లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చరిత్ర పుటల్లో చిరస్థాయిగా ఉదయగిరి:నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉదయగిరి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా పేరు లిఖించుకుంది. వెయ్యేళ్ల చరిత్రను తన కాల గర్భంలో దాచుకుని చోళులు, పల్లవులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, ఆంగ్లేయుల పరిపాలన కేంద్రంగా ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల పాలనలో అయితే దేదీప్యమానంగా వెలిగింది. విజయనగర రాజ్యానికి సింహ ద్వారమైన ఇక్కడ రత్నాలు రాశులుగా పోసి విక్రయించారని చెప్పుకుంటారు. శ్రీకృష్ణ దేవరాయల పాలనలో ఇక్కడి 365 ఆలయాల్లో దేవతామూర్తులకు నిత్యం కళ్యాణాలు నిర్వహించేవారు. బ్రిటిష్ వారి పాలనలో ఏర్పాటైన సబ్ జైలు ప్రాంగణంలోని భవనాల్లో ప్రస్తుతం తహసీల్దారు, సబ్ రిజిస్ట్రారు కార్యాలయాలు కొనసాగుతున్నాయి.
పర్యాటకులతో కళకళలాడే కోట: తిరుమల గిరులను పోలి ఉండే ఉదయగిరి కొండలపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. సముద్ర మట్టానికి 3 వేల 79 అడుగుల ఎత్తులో ఉండే దుర్గం కొండ ప్రకృతి రమణీయతతో చూపరుల మదిని కట్టిపడేస్తుంది. ఈ ఉదయగిరి దుర్గం ఆయుర్వేద వనమూలికలకు నిలయం. నల్లమల, వెలిగొండ, శ్రీశైలం అడవుల్లో సైతం లభించని అరుదైన అనేక రకాల ఔషధ మొక్కలు దుర్గంపై ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ పర్యాటక ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తారు.
సౌకర్యాలు కరవై సందర్శకుల ఇబ్బందులు:ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఈ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గాలు లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంతి తీసుకునేందుకు విశ్రాంతి గదులు, తాగునీరు వంటి సౌకర్యాలు సరిగా లేవని పర్యాటకులు చెబుతున్నారు. ఉదయగిరి దుర్గాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు దీని గొప్పతనం తెలియజేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.