Temperature RisingSince January And February in Andhra Pradesh :వేసవి కాలం అంటే ఏప్రిల్, మే నెలలని టక్కున చెప్పేస్తారు. కానీ, వాతావరణ మార్పుల కారణంగా జనవరి, ఫిబ్రవరి నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వేసవి ముందుగానే వచ్చేసిందా అనే భావన కలుగుతోంది. ఏటా ఉష్ణోగ్రతల్లో రికార్డు స్థాయి పెరుగుదల నమోదవుతోంది. గత శతాబ్ద కాలంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. 2025 కూడా అదే మాదిరిగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- 2023లో ఆరు నెలలు, 2024లో ఏడాది పొడవునా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- 1901 నుంచి సేకరిస్తున్న సమాచారం ప్రకారం 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఉష్ణోగ్రత సగటున 0.65 డిగ్రీలు పెరిగింది.
- గతేడాది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో సాధారణం కంటే 0.37 డిగ్రీలు పెరిగింది.
- ఈ ఏడాది జనవరిలో ఉష్ణోగ్రత సగటున 0.94 డిగ్రీలు పెరిగింది. 1958లో 1.17, 1990లో 0.97 డిగ్రీలు పెరిగాయి. ఆ తర్వాత ఇదే అధికం.
‘లానినా’పైనా ప్రభావం :వాతావరణ మార్పుల ప్రభావం లానినా పరిస్థితులపై పడుతోంది. ‘లానినా’ పరిస్థితులు బలహీనపడటంతో శీతాకాలంలోనూ చలి తీవ్రత అసాధారణంగా లేదు. వచ్చే వారం నుంచి తూర్పు, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అయిదు డిగ్రీల వరకు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు. దక్షిణ, వాయువ్య భారతంలోని కొన్ని మినహా అన్ని ప్రాంతాల్లోనూ వేడి వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు. కేరళలో జనవరిలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యాయి.