TDP Leaders Fired on Jagan Government: జగన్ సర్కార్ గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో అవలంబించిన తీరుపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వ్యాఖ్యలు చేశారు. హై కరెప్షన్, హై ఇన్‌ప్లేషన్, హై అన్ఎంప్లాయ్మెంట్, సిస్టమ్స్ కొలాప్స్ అనే విధ్వంసకర ఆర్థిక విధానాలతో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ముంగిట వెనుకబడిన వర్గాలను వంచించడానికే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో బీసీ కులగణన చేయిస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్ధిక దుస్థితిపై అసెంబ్లీ సాక్షిగా చేదు నిజాలను దాచిపెట్టి రాష్ట్ర ప్రజలను మసిపూసి మారేడు కాయ చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని యనమల దుయ్యబట్టారు. గురువారం జాతీయ మీడియాలో వచ్చిన సర్వే దెబ్బకి వైసీపీ ఖేల్ ఖతం దుకాణం బంద్ అయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఎద్దేవా చేశారు.
Kollu Ravindra: వాలంటీర్లు చేస్తున్న బీసీ కులగణనకు విశ్వసనీయత, చట్టబద్ధత ఉంటుందని జగన్ చెప్పగలడా అని రవీంద్ర నిలదీశారు. బీసీలను మరోసారి వంచించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికే హడావుడిగా కేంద్రంతో సంప్రదించకుండా జగన్ కులగణనకు శ్రీకారం చుట్టాడని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాంగపరంగా స్థానిక సంస్థల్లో దక్కాల్సిన 16వేలకు పైగా పదవులు దక్కుండా చేసిన జగన్ కులగణనతో వెనుకవడిన వర్గాలను ఉద్ధరిస్తాడా అని రవీంద్ర ప్రశ్నించారు.
చంద్రబాబు బీసీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన పెద్దమనిషి కులగణనతో వారిని ఆదుకుంటాడా అని ఆక్షేపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీసీ కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపారని కొల్లు గుర్తుచేశారు. బీసీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి, మొత్తం బడ్జెట్లో 26శాతం నిధులు బీసీల సంక్షేమానికి వెచ్చించాలని కోరారని తేల్చిచెప్పారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని, కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరామన్నారు. చంద్రబాబు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒక్కసారి కూడా కేంద్రప్రభుత్వంతో ఎందుకు మాట్లాడలేదని రవీంద్ర ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వంలో బీసీలపై అఘాయిత్యాలు పెరిగాయి: కొల్లు రవీంద్ర