Old Age Marriages in Hyderabad:ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరికి ఉన్న ఒకే ఒక సమస్య. కళ్ల ముందే కన్నబిడ్డలు, చేతినిండా సంపాదన్న ఉన్నా ఏదో తెలియని వెలితి. మనసుకు సంతోషం కలిగించే తోడు లేని లోటు. అందుకే పదుల వయసులోనూ తమ హృదయంతో పెనవేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు. అడ్డంకులను దాటుకుని జంటగా ప్రయాణం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెళ్లి బంధంతో కొత్త బంధాలను సృష్టించుకుంటున్నారు.
కాలంతో వస్తున్న మార్పులకు హైదరాబాద్ నగరం వేదికవుతోంది. గతంలో రెండో పెళ్లి లేదా పెద్దలకు వివాహాలు అంటే అంతా వింతగా చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో ఒంటరితనంతో కొంతమంది పడుతున్న మానసిక వేదనను గుర్తించి తోడును వెతికే పని చేస్తోంది ఇక్కడి పౌర సమాజం. కరోనా సమయంలో అనేక మంది తమ జీవిత భాగస్వాములను కోల్పోయారు. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల కారణంగా కట్టుకున్న వారు దూరమైన వారు, పిల్లల జీవితాలను తీర్చిదిద్దాలనే బాధ్యతల్లో మునిగి మరో వివాహం గురించి ఆలోచించని వారు కూడా ఎంతో మంది ఉన్నారు. వయసులో ఉన్నప్పుడు పెళ్లి వద్దనుకుని ఒంటరిగా మిగిలిపోయిన వారు, వివాహం జరిగి భాగస్వామి దూరమై పెద్దలు మనోవేదనకు గురవుతున్నారు.
వివాహాలు చేస్తున్న పిల్లలు:జీవిత ప్రమాణాలు పెరిగి ఉద్యోగ విరమణ చేశాక మొదలయ్యే జీవితంలో పాతికేళ్ల పాటు ఆరోగ్యంగా ఉంటున్నారు. అందుకే ఈ వయసులో తమకు తోడును ఎవరు వెతుకుతారని వారే పెళ్లిచూపులకు వెళ్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పిల్లలే దగ్గర ఉండి తమ తల్లి లేదా తండ్రికి వివాహం చేస్తున్నారు.
ఆస్తి కోసం అమానుషం - 3 రోజులైనా జరగని అంత్యక్రియలు
నా భర్త సినిమా పరిశ్రమలో పని చేసేవారు. ఆయన ప్రవర్తనతో విసిగిపోయి విడాకులు తీసుకున్నాను. మాకో కుమార్తె ఉంది. నేను తర్వాత ఎల్‌ఎల్‌బీ చదివాను. హిస్టరీలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. నా కుమార్తెకు బెంగళూరులో ఘనంగా వివాహం చేశాను. ప్రస్తుతం నా వయసు 57. ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో మెంబర్‌గా చేరాను. ఎంతోమంది పరిచయం అవుతున్నా, నాకు తగిన వ్యక్తి కోసం చూస్తున్నా.- బొమ్మ అరుణాచౌదరి, హైదరాబాద్