ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై నిఘా - ఎన్నికల వ్యూహాలు వైసీపీకి చేరవేస్తున్నారా ? Surveillance on Opposition Parties: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అయినా నిష్పక్షపాతంగా పని చేయాల్సిన నిఘా విభాగం ఇప్పటికీ అధికార పార్టీ జేబు సంస్థగా పని చేస్తోంది. చివరకు ఎన్నికల వ్యూహాలను నిర్ణయించుకునేందుకు ఏర్పాటు చేసుకునే అంతర్గత సమావేశాలనూ వదలడం లేదు. విజయవాడలో తెలుగుదేశం తరపున లోక్‌సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు దిశానిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన, బీజేపీ నేతలు మాట్లాడారు.
ప్రారంభోపన్యాసం తరువాత అభ్యర్థులు, వారి మేనేజర్లు తప్పితే మరెవరూ అక్కడ ఉండొద్దని, అందరూ బయటకు వెళ్లిపోవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులతో పాటు ఇతర టీడీపీ నేతలు, వారి అనుచరులు కూడా బయటకొచ్చారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో ఒకరు వీడియో తీస్తుండటాన్ని గమనించిన టీడీపీ నేతలు, అతడిని ప్రశ్నించగా టీడీపీ కార్యకర్తనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. గట్టిగా నిలదీయడంతో తాను నిఘా విభాగం పోలీసునని చెప్పారు. ఆయన ఫోన్‌పై వైసీపీ బొమ్మ ఉండటం గమనార్హం.
చంద్రబాబు నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఫోన్ ట్యాపింగ్ కలకలం- కానిస్టేబుల్‌ను పట్టుకున్న టీడీపీ నేతలు - Phone tapping in TDP workshop
వర్క్‌షాప్‌కు హాజరైన వారంతా ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులే. సంఘ విద్రోహ శక్తులు కాదు. పైగా వారు పాల్గొన్నది ఓ అంతర్గత సమావేశం. మరి అక్కడ నిఘా విభాగానికి ఏం పని అని టీడీపీ వర్గాలు నిలదీస్తున్నాయి. తమ ఎన్నికల వ్యూహం ఏమిటో తెలుసుకుని వైసీపీ పెద్దలకు చేర వేయడమే వీటి వెనక ఉద్దేశమని ఆరోపిస్తున్నాయి. 2021 అక్టోబరులో మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. అద్దాలు ధ్వంసం చేసి, అడొచ్చిన వారిపై విరుచుకుపడ్డాయి. ఆ సందర్భంగా ఒక వ్యక్తి దారి తెలియక గదిలో దాక్కోగా, ఆయనను తాము పట్టుకున్నామని, తాను డీజీపీ ఆఫీసులో పనిచేసే పోలీసుగా చెప్పాడు.
ఒక పోలీసుకు వైసీపీ శ్రేణుల వెంట టీడీపీ కార్యాలయంలోకి వెళ్లాల్సిన పని ఏముంది? వైసీపీ వారు అక్కడ ఎంతమందిని చితకబాదారు, విధ్వంసం ఎలా చేశారనేది చిత్రీకరించి పెద్దలకు పంపిస్తారా?' అని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రశ్నించారు. పైగా పట్టుబడిన వ్యక్తే తనపై టీడీపీ నేతలు దాడి చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం గమనార్హం. ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేందుకు ఇలాంటి సమావేశాలకు కావాలనే ఎస్సీ, ఎస్టీ వర్గాల సిబ్బందిని పంపిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.
ఎంపీ కృష్ణదేవరాయలు పేరిట వైఎస్సార్సీపీ ట్వీట్- ఈసీకి ఫిర్యాదు - TDP Leaders on Visakha drug case
వీడియోలు తీసేందుకు హాజరవుతున్నారు: రాష్ట్ర స్థాయిలోనే కాదు, జిల్లాల్లో అయినా, నియోజకవర్గాల్లో అయినా ప్రతిపక్ష నేతల కార్యకలాపాలపై డేగ కన్ను పెట్టడమే తమ పని అన్నట్లుగా నిఘా విభాగం తయారైంది. వైసీపీ నేతలు కూడా ఎక్కడికక్కడే సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. నిఘా విభాగం పోలీసులు కనీసం అక్కడకు వెళ్లే ధైర్యమూ చేయరని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్వహించే మీడియా సమావేశాలకు కూడా నిఘా విభాగానికి చెందిన వారు వీడియోలు తీసేందుకు హాజరవుతున్నారు. పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులు వస్తుండటంతో వారిని ప్రత్యేకంగా గుర్తించే అవకాశం ఉండదు. ఎవరైనా గుర్తించి అడిగినా ఏదో ఒక మీడియా పేరు చెప్పి బయటపడుతున్నారు. గట్టిగా నిలదీస్తే తాము పోలీసు విభాగమని చెబుతున్నారు.
నిఘా విభాగాన్ని ప్రక్షాళన చేయాలి: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ప్రభుత్వ శాఖలు నిష్పక్షపాతంగా పని చేయాలి. నిఘా విభాగం మాత్రం ఇప్పటికీ అధికార పార్టీకి అనుబంధ శాఖగానే పని చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్‌పై ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి టీడీపీ నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుని నిఘా విభాగాన్ని ప్రక్షాళన చేస్తే తప్ప స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది.
ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వాలంటీర్, ఫీల్డ్ అసిస్టెంట్‌పై వేటు - volunteer suspension in kadapa