Supreme Court on Jagan Illegal Assets Case: మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం, బెయిలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం భోజన విరామానికి ముందు విచారణ చేపట్టింది. ఈ ఏడాది మే 2న సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లోని అంశాలను కోర్టు పరిశీలించింది. ఈ కేసులో నమోదు చేసిన కేసుల వివరాలు, ట్రయల్ పురోగతిపై సీబీఐ సుప్రీంకోర్టుకు నివేదించింది.
ఈ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని, ట్రయల్ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించారని అందులో తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలయ్యాయని వివరించారు. వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే జడ్జీలు మారిపోతున్నారని, తాజా న్యాయమూర్తి కూడా రెండేళ్లు కాకుండానే బదిలీ అయ్యారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కేసులో నిందితులంతా శక్తిమంతులే అని సీబీఐ పేర్కొంది. సీబీఐ అఫిడవిట్‌లోని అంశాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక కోర్టులో వచ్చిన ఆదేశాలు తప్పు అని, ఇంకో కోర్టులో ఇచ్చిన ఉత్తర్వులు తప్పు అంటూ కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. కోర్టుల ఉత్తర్వులు తప్పు అంటూ చేస్తున్న వ్యవహారానికి ట్రయల్‌కి సంబంధం లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. కేసులు ట్రయల్ ప్రారంభం కాకుండానే ఇన్ని కేసులు ఎలా ఫైల్ చేశారని న్యాయమూర్తి ప్రశ్నించారు.