Superstitious Beliefs Victims are Being Chained to Places of Worship :తెలంగాణ రాష్ట్రంవరంగల్ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ఓ ప్రార్థనా స్థలంలో మానసిక దివ్యాంగులకు అశాస్త్రీయ విధానంలో చికిత్స అందిస్తున్నారు. మానసిక వ్యాధుల నిపుణులు, ఇతర డాక్టర్లు ఎవ్వరూ లేకుండా దేవుడు కరుణిస్తాడనే మూఢనమ్మకంతో అమాయకులను ఏళ్ల తరబడి గొలుసులతో కట్టేసి బంధిస్తున్నారు.
ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా ఆస్పత్రులకు వెళ్లకుండా కొన్ని కుటుంబాలు మానసిక దివ్యాంగులైన తమ వారిని ఈ ప్రార్థనా స్థలానికి తీసుకువస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఆడ, మగ, ముక్కుపచ్చలారని పిల్లలు, నవ యువకులు, వృద్ధులు ఇక్కడ బాధితులుగా గొలుసుల మధ్య బందీ అయ్యారు.
ఏదో ఊహించని ఘటనతో, తీవ్ర ఒత్తిడితో, ప్రేమ విఫలంతో, కుటుంబ సమస్యలతో మతిస్థిమితం తప్పిన వారిని మొదట్లో ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఆరోగ్యం కుదుట పడలేదని, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పోతున్నామంటూ దేవుడి కృపతో వాళ్లు బాగైపోతారని భావించి చాలా మంది తమవారి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రార్థనా స్థలానికి వచ్చాక బాధితులను 41 రోజులు నిద్ర చేయిస్తారు. మూడు పుటలా ప్రార్థనలకు తీసుకొస్తారు. అప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేకుంటే దేవుడి ఆజ్ఞగా భావిస్తూ వారిని అక్కడే ఇనుప గొలుసులతో కట్టేస్తారు. దేవుడి నుంచి ఆజ్ఞ వస్తేనే, సెలవు మంజూరు చేసి ఇంటికి పంపిస్తామని వాళ్లను అక్కడే బందీ చేస్తారు.
చేతులను, కాళ్లను గొలుసులతో కట్టి :ప్రస్తుతం గ్రామంలో 50 మంది మానసిక వికలాంగులు ఉన్నారు. కొందరికి వారి బంధువులే దగ్గరుండి సేవలు చేస్తుంటే మరికొందర్ని ప్రైవేటు స్టే హోంలలో చేర్చుతున్నారు. ఇంకొందరు చూసుకోడానికి ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్నారు. బాధితులు చేతులు, కాళ్లకు గొలుసులతో తిరుగుతున్న వారిని చూసి పిల్లలు భయపెడుతున్నారు. లోకం తెలియని ఈ బాధితులను ఏమీ అనలేం పాపం అని స్థానికులే సర్దుకుపోతున్నారు.