Three States Irrigation Ministers Meeting in Rajasthan : రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో అఖిలభారత స్థాయి జలవనరుల మంత్రుల సమావేశం సందర్భంగా రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఏ రాష్ట్ర రైతులూ నష్టపోకుండా నీటి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుందామని మంత్రులు నిర్ణయించుకున్నారు. కృష్ణా జలాలపై మాట్లాడేటప్పుడు.. కేవలం ఈ ఏడాది నదిలో లభ్యమైన నీటిని దృష్టిలో పెట్టుకుని చర్చించుకోవడం సరికాదని రామానాయుడు అన్నారు. తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇద్దరితో కృష్ణా అంశాలు చర్చకు వచ్చాయి.
సరైన సమయంలో రాక: నిజానికి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాజలాలు సరైన సమయంలో అందక ఇక్కడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పదేళ్లుగా కృష్ణా జలాల లభ్యత ఎలా ఉందో దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల వంటి ప్రాజెక్టులు నిండితే తప్ప శ్రీశైలానికి నీళ్లు రావని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారిందన్నారు.
సరైన ప్రణాళికతో: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని వినియోగించుకునే విషయంలో తెలంగాణ, ఏపీ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల రైతులకు ఇబ్బంది లేకుండా, తాగునీటికి సమస్య రాకుండా ఈ నీటిని సమర్థంగా పరస్పర అంగీకారంతో జూన్ వరకు సరైన ప్రణాళికతో వినియోగించుకుందామని మంత్రి రామానాయుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చెప్పారు.