Ratha Saptami Celebrations :తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు సప్తగిరీశుడు సప్తవాహన సేవల్లో భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలను తిలఖించేందుకు పెద్దసంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి పునీతులయ్యారు. దాదాపు రెండు లక్షల మంది పైగా వాహన సేవలను తిలకించారని అంచనా వేశారు. శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో భక్తుల గోవిందా నామస్మరణతో మారుమోగింది. నాలుగు సంవత్సరాల తర్వాత మాడ వీధుల్లో షెడ్లును ఏర్పాటు చేసి వేసవి తాపం భక్తులపై పడకుండా చర్యలు తీసుకుంది. ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించిన సౌకర్యాలపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
సూర్యప్రభవాహన సేవ :మాఘశుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలో రథసప్తమి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభోవపేతంగా ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభమైన వాహనసేవలు రాత్రి తొమ్మిది గంటల వరకూ కన్నులపండువగా సాగాయి. మొదటగా స్వామివారు సూర్యప్రభవాహనంపై సూర్యనారాయణమూర్తిగా ఊరేగుతూ వాయువ్య దిశకు చేరుకున్నారు. అక్కడ స్వామివారిపై సూర్యకిరణాలు తాకిన అనంతరం అర్చకులు కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించడంతో వాహన సేవలు ప్రారంభమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా రథసప్తమి వేడుకలు - భక్తుల దైవ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు
చక్రస్నానం :సూర్యప్రభవాహన సేవ అనంతరం చిన్నశేష, గరుడ, హనుమంత వాహన సేవల్లో స్వామివారు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కార్యక్రమంను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మద్య చక్రతాళ్వార్లకు అభిషేకాదులు, దూప దీప నైవేధ్యాలను సమర్పించి పుష్కరస్నానం చేయించారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.