Police Suggestions for Home Security Measures :తెలుగురాష్ట్రాల్లో దసరా పండుగ సెలవులు మొదలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటిల్లిపాదీ నగరం నుంచి సొంత ఊళ్లకు ప్రయాణమవుతుంటారు. గజ దొంగలు మాత్రం ఇలాంటి సమయం కోసమే కాచుకుని కూర్చుంటారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు గుల్ల చేస్తారు. ఏటా దసరా, సంక్రాంతి పండుగల సమయాల్లోనే చోరీలు అధికంగా నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్ పోలీసులు చోరీల నివారణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కచ్చితంగా పాటిస్తే చోరీలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
- పట్టణం నుంచి మీ స్వగ్రామానికి వెళ్లేటప్పుడు విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దు. వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచడమే ఉత్తమం. ఇంట్లో అయితే రహస్య ప్రదేశంలో దాచుకోవాలి.
- మీ ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ లేదా సెంట్రల్ లాక్ సిస్టమ్‌ను అమర్చుకోవాలి. ఇంట్లో లేనప్పుడు పాలప్యాకెట్లు, పత్రికలు తలుపు ముందు జమవ్వకుండా చూడాలి. ఇంటి బయట, లోపల కొన్ని లైట్లు ఆన్‌లో ఉంచుకోవాలి.
- వాహనాలను కచ్చితంగా ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. ద్విచక్ర వాహనాల(బైక్, సైకిళ్లు) చక్రాలకు ప్రత్యేక లాక్ వేయాలి.
- బీరువా, లాకర్ తాళాలను రహస్య ప్రదేశంలో మాత్రమే దాచాలి. ఇంట్లోని సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ ద్వారా గమనిస్తూ ఉండాలి.
- ఊరు, విహార యాత్రలకు వెళ్లే విషయం సామాజిక మాధ్యమాల్లో(ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్) పంచుకోవద్దు.
- కాలనీ సంఘాలు, అపార్టుమెంట్లలో ఉన్నవారైతే కచ్చితంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలి.
- కాలనీల్లో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
- ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారమివ్వాలి.
- చోరీలకు ముందు దొంగలు కచ్చితంగా రెక్కీ నిర్వహిస్తుంటారు. పగటిపూట వేర్వేరు కారణాలతో వచ్చి కాలనీల్లో రెక్కీ చేసి రాత్రి దొంగిలిస్తుంటారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్‌చేసి వెంటనే సమాచారమివ్వాలి.
- కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు డయల్ 100 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్ నెంబరుకు సమాచారం ఇవ్వాలి.