Police Caught Thief Sleeping in Stolen Car at Kadapa District:కడప జిల్లా ఓ దొంగ అందరూ నవ్వుకునే విధంగా ఓ దొంగతనం చేశాడు. రోడ్డుపై ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని గుట్టుచప్పుడు కాకుండా దొంగిలించారు. అనుకున్న పని అయిపోయింది అనుకుని అక్కడి నుంచి బండితో పరార్ అయ్యాడు. కొంత దూరం వెళ్లాక నెంబర్ ప్లేట్లు ఉంటే దొరికిపోతానేమో అనుకుని బండిని ఆపి నెంబర్ ప్లేట్లను తొలగించి హమ్మయ్యా అనుకున్నాడు. అయితే అక్కడే గమ్మత్తు చోటు చేసుకుంది. బండి అద్దాలను దించడంతో చల్లగా గాలి వీచింది. ఇంకేముంది మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. తీరా నిద్రలేవగానే పోలీసులు ప్రత్యక్షమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.
అద్దాలను పైకెత్తి చల్లగా నిద్రలోకి: జిల్లాలోని వేంపల్లి పట్టణ సమీపంలోని రాయచోటి - పులివెందుల బైపాస్ రోడ్డు పక్కన శివారెడ్డి అనే వ్యక్తి ఇటీవల వరి పంట కోసుకొని వడ్లను రోడ్డుపై ఆర వేసుకున్నాడు. ఆ వడ్ల దగ్గర వాళ్ల తండ్రిని కాపలాగా పెట్టాడు. అసలే చలికాలం పైగా మంచు కూడా కురుస్తుంది. ఈ క్రమంలో తన తండ్రి ఇబ్బంది పడకూడదని తన బొలెరో వాహనంలో నిద్రిస్తాడులే అని AP 39 DF 2408 నెంబరు గల బొలెరో వాహనాన్ని అక్కడ పెట్టాడు. ఇదే అదునుగా చూసుకున్న దొంగ అర్ధరాత్రి 12 గంటల సమయంలో శివారెడ్డి తండ్రి బండిలో లేని సమయం చూసుకొని బండిని స్టార్ట్ చేసుకొని వెళ్లిపోయాడు. అలా కొంత దూరం వెళ్లాక వేంపల్లి పట్టణ సమీపంలోని సంచుల ఫ్యాక్టరీ వద్ద బండిని పక్కకు ఆపి బండి నెంబర్ ప్లేటు తొలగించి, అద్దాలను పైకెత్తి చల్లగా నిద్రలోకి జారుకున్నాడు.