Vijayawada Floods Updates : ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ విజయవాడ వరద ముంపు బాధితులకు రూ.25 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మేర సాయం అందిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. రేపటి కోసం తమ సామాజిక బాధ్యతగా ఈ మొత్తం అందిస్తున్నట్లు వెల్లడించింది.
బాధితులకు అండగా కమ్మజన సేవా సమితి వసతిగృహం :ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు గుంటూరు కమ్మజన సేవా సమితి వసతిగృహం తరపున ఆహారాన్ని పంపించారు. వెజిటేబుల్ బిర్యాని, పెరుగన్నం, వాటర్ బాటిల్స్‌ను 1500 మందికి సిద్ధం చేసి విజయవాడకు పంపామని అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు తెలిపారు . ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖకు వీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా దుప్పట్లు, వంట సామగ్రిని అందించేందుకు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.
మరోవైపు వరద బాధితుల కోసం గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయపాత్ర వంటశాలలో ప్రభుత్వం మంచి రుచికరమైన, పౌష్టికాహారాన్ని అందిస్తోంది. రోజుకు సుమారు 3 లక్షల మందికి సిద్ధం చేస్తున్నారు . సాంబారన్నం, పెరుగన్నాన్ని తయారు చేస్తున్నారు. మనుషుల ప్రమేయం లేకుండానే లక్షల మందికి ఆహారం సిద్ధమవుతోంది. ఇలా తయారైన వాటిని మంగళగిరి నగరపాలక సంస్థ సిబ్బంది ప్యాకింగ్ చేస్తున్నారు. సుమారు వందల సంఖ్యలో మంది డ్వాక్రామహిళలు ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పులో 20,000ల మందికి విజయవాడలోని వరద బాధితుల కోసం పంపుతున్నారు.