No Industrial Growth in YCP Government : ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలు మూతపడేలా చేయడంలో మాత్రం వైసీపీ సర్కారు విజయవంతమైంది. ఒకటి కాదు రెండు కాదు అనేక పెద్ద, చిన్న పరిశ్రమలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా మూసేసి వెళ్లిపోయాయి. ఎంఎస్‌ఎంఇ నుంచి ఐటీ కంపెనీల వరకు వందల కంపెనీలు 2014 నుంచి 2019 వరకూ తెలుగుదేశం హయాంలో జిల్లాలో ఏర్పాటయ్యాయి. వాటిలో ఇప్పటికే చాలావరకూ వెళ్లిపోయాయి. చివరికి తమ సొంత కాళ్లపై బ్యాంకు రుణాలతో చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకుని నడుపుతున్న ఎలీప్ లాంటి మహిళా పారిశ్రామికవేత్తల ప్రాంగణాల్లోనూ అనేక యూనిట్లు మూతపడ్డాయి. ఒక్క సూరంపల్లి ఎలీప్ ప్రాంగణంలోనే 2019 తర్వాత ఇప్పటివరకు దాదాపు 40కు పైగా యూనిట్లు మూతపడ్డాయంటే జగన్ సర్కారు దెబ్బకు పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. జగన్ పాలనలోని ఈ ఐదేళ్లలో కనీసం పరిశ్రమలను తేలేకపోయినా గత ప్రభుత్వ హయాంలో నెలకొల్సిన వాటినైనా మూతపడకుండా ఆపగలిగితే ఇంత పెద్దఎత్తున ఉపాధి రంగానికి దెబ్బపడేది కాదు.
జగన్ గద్దెనెక్కినప్పటి నుంచి ఎక్కడికక్కడే ఆగిన అభివృద్ధి:జగన్ ఈ ఐదేళ్ల పాలనలో పారిశ్రామికంగా విధ్వంసం తప్ప ప్రగతి అన్నది ఎటుచూసినా లేకుండాపోయింది. మేధా టవర్స్‌లో ఐటీ కంపెనీలు పెట్టేందుకు గతంలో కంపెనీలు బారులు తీరేవి. దీంతో టవర్-2 నిర్మాణాన్ని కూడా అప్పట్లో ఆరంభించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ టవర్ మధ్యలోనే ఆగిపోయి ప్రస్తుతం మొండిగోడలతో వెక్కిరిస్తోంది. వాస్తవంగా గత టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి కృష్ణాజిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి పారిశ్రామిక ప్రగతి జరిగేలా చర్యలు చేపట్టింది. అందుకే తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో టీడీపీ ప్రభుత్వం నిలబెట్టింది. పారిశ్రామిక ప్రగతి అంటే కేవలం మల్లవల్లిలో అశోక్‌లేల్యాండ్ లాంటి భారీ పరిశ్రమలతోనే కాకుండా ఎంఎస్‌ఎంఇ లపై దృష్టి పెట్టారు. ఇదే సమయంలో ఐటీ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలకు విపరీతంగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. వీటికి అవసరమైన మౌలికవసతులు, భవనాల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టిపెట్టారు. కానీ జగన్ గద్దెనెక్కిన నుంచి ఇవన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. వీరికి ఇచ్చిన ప్రోత్సాహకాలను ఆపేశారు. అంతే ఉద్యోగ, ఉపాధి రంగంలో వెలుగులన్నీ మాయమైపోయి చీకట్లు అలముకున్నాయి.
టీడీపీ హాయంలో ఏడాదికి 500 నుంచి 1500 పరిశ్రమలు : చంద్రబాబు దార్శనికత ఎలా ఉంటుందనడానికి 2014 జూన్ నుంచి 2019 వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏర్పాటైన పరిశ్రమలే ప్రత్యక్ష నిదర్శనం. ఆయన పాలనలోని ఐదేళ్లలో 6582 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఏడాదికి 500 నుంచి 1500కు పైగా పరిశ్రమలను తీసుకొచ్చారు. 2016-17 ఒక్క ఏడాదిలోనే 3038 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. టీడీపీ హయాంలోని ఐదేళ్లలో 2319 కోట్లు ఎంఎస్‌ఎంఇ రంగంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టారు. వీటితో జిల్లాలో 67428 మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి. మొత్తంగా ఎంఎస్‌ఎంఇ భారీ పరిశ్రమలు కలిపి రూ.7145 కోట్ల పెట్టుబడులు ఐదేళ్లలో ఇక్కడికి వచ్చాయి. ప్రధానంగా కాటన్, టెక్స్‌టైల్స్ అండ్ గార్మెంట్స్, కెమికల్స్, నిర్మాణరంగ అనుబంధ ఉత్పత్తుల తయారీ, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, సిరామిక్, ప్లాస్టిక్, గోనెసంచులు, స్టీల్ సామగ్రి, రక్షణ రంగ విడిభాగాలు, ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటయ్యాయి.
Industrial Growth in AP :టీడీపీ ఐదేళ్ల పాలనలో కృష్ణాలో భారీ పరిశ్రమలు 17 ఏర్పాటై ఉత్పత్తిని కూడా ఆరంభించాయి. వీటి ఏర్పాటుతో రూ. 2,339 కోట్ల పెట్టుబడులు జిల్లాకు అప్పట్లో వచ్చాయి. 6,820 మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి. జిల్లాలోని వీర్లుపాడు మండలంలోని నరసింహరావుపాలెంలో సహ్యాద్రి ఇండస్ట్రీస్ లిమిటెడ్, నందివాడ తనిరిసలో ఉమా స్పిన్‌టెక్‌స ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జగ్గయ్యపేటలోని తిరుమలగిరిలో ఇందు టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్, మదినేపల్లిలోని సింగరాయపాలెంలో గ్రోవెల్ ప్రొసెసర్స్ లిమిటెడ్, కృత్తివెన్నులోని మునిపెడలో ఎన్‌జీ పాస్ఫేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాపులపాడు మండలంలోని కోడూరుపాడులో మిలేష్ మెరైన ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్, రేమల్లెలో మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్, వత్సవాయి పరిధిలోని బహ్మవరంలో 4S స్పిన్‌టెక్, కోడూరు పరిధిలోని కవులూరులో ఎన్‌సీఎల్ ఆల్‌టెక్, కంచికచర్ల పరిధిలోని కీసరలో ఇన్వితా కెమికల్స్ లిమిటెడ్ తదితర సంస్థలు వచ్చాయి. మరో 11 భారీ పరిశ్రమలు కూడా చంద్రబాబు దిగిపోయే సమయంలో జిల్లాలో నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో మల్లవల్లిలోని అశోక్ లేలాండ్ లిమిటెడ్ లాంటివి జగన్ వచ్చాక ఆగిపోయాయి.