Nara Lokesh Shankaravam Meeting: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేటి ప్రారంభించిన శంఖరావం యాత్ర ఉత్తరాంధ్రలో గర్జించింది. ఇచ్చాపురం, పలాస, టెక్కలిలో జరిగిన బహిరంగ సభల్లో లోకేశ్, జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
శంఖరావం యాత్ర ద్వారా లోకేశ్ యువగళం పాదయాత్ర జరగని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున 11 రోజులపాటు పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నవ్యాంధ్రకు నవశకం లిఖించే సమర నినాదంతో లోకేశ్ యాత్రను ప్రారంభించారు.
ఉత్తరాంధ్రను తెలుగుదేశం జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చిందని లోకేశ్ గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్‌గా మార్చిందని విమర్శించారు. విశాఖ జిల్లాలో వైసీపీ నేతల భూకబ్జాలు బాగా పెరిగాయని ఆరోపించారు. వారి వేధింపుల వల్లే అధికారుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యకర్తలపై కేసులు,వేధింపులకు బదులు ఉంటుంది- పలాస శంఖారావం సభలో గౌతు శిరీష
23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని జగన్ అన్నారని, అలాంటిది ఎన్నికల ముందు కేవలం 6 వేల పోస్టులతో డీఎస్సీ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ వేసే బాధ్యత తనదని లోకేశ్ హామి ఇచ్చారు. కరెంట్ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్ అని లోకేశ్ మండిపడ్డారు. విశాఖ రాజధాని అంటున్న జగన్, విశాఖకు ఒక్క కంపెని అయినా తీసుకు వచ్చారా అని ప్రశ్నించారు. విశాఖలో అభివృద్ధి పనులకు ఎక్కడైనా ఒక్క ఇటుక వేశారా అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో మూతబడిన పంచదార పరిశ్రమలను తెరిపించారా అంటూ ప్రశ్నల వర్షం కురింపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకుంటామని అన్నారు.
శంఖారావం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం: పత్తిపాటి పుల్లారావు
వంశధార, నాగావళిని అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని గుర్తు చేశారు. పలాస నియోజకవర్గానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేశామని ప్రకటించారు. మంత్రి సీదిరి పలాస నియోజకవర్గంలో ఒక్క రోడ్డు వేశారా అని ప్రశ్నించారు. హెల్త్ వర్కర్, అంగన్వాడీ పోస్టులనూ ఇక్కడి మంత్రి అమ్ముకుంటున్నారని లోకేశ్ మండిపడ్డారు. పలాస నియోజకవర్గంలో ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా అని నిలదీశారు. మంత్రి సీదిరి, కొండలరాజు అనే పేరు తెచ్చుకున్నారని విమర్శించారు.