Nara Lokesh Emotional Post in Social Media 'X' :తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీను ఆత్మహత్యపై మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. 'అన్నా..అన్నా' అని పిలుస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసే శ్రీనునే.. తనకు ఆపద వస్తే మాత్రం ఒక్క మెసేజ్ కూడా చేయాలనిపించలేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. "దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు, ఐ మిస్ యూ" అంటూ తన బాధను వ్యక్తపరిచారు. శ్రీను ఆత్మహత్య చేసుకున్న సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదని వాపోయారు.
కష్టసుఖాలను పంచుకుందాం : తన కష్టమేంటో కూడా తనతో చెప్పలేదని లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. " శ్రీను కుటుంబానికి ఓ అన్నలా తానున్నానని, కుటుంబానికి అండగా ఉంటూ అన్ని బాధ్యతల్ని నెరవేరుస్తానని" నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. "ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా ఒకరికొకరు కష్టసుఖాలను పంచుకుందాం" అంటూ కార్యకర్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, అభిమానులకు లోకేశ్ తన విజ్ఞప్తిని 'ఎక్స్' ద్వారా పోస్ట్ చేశారు.
'సౌదీలో ఇబ్బందులు పడుతున్నా-రక్షించండి' - మంత్రి లోకేశ్‌కు మహిళ విజ్ఞప్తి
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది : అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యల్లో ఇలా ఏదైనా సరే ఉంటే కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు ఎవరితోనైనా పంచుకోవాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని లోకేశ్ తెలిపారు. దయచేసి ఆత్మహత్య లాంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. 'బతికే ఉందాం మరో నలుగురిని బతికిద్దాం' అంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
"అన్నా.. అన్నా.. అంటూ అప్యాయంగా పిలిచేవాడివి. ఎవరికి ఎటువంచి కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నా పుట్టినరోజులు, పెళ్లి రోజులను పండగలా జరిపేవాడివి. నీకు ఆపద వస్తే మాత్రం ఈ అన్నకి ఒక్క మెసేజ్ కూడా చేయాలనిపించలేదా? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు. ఐ మిస్ యూ. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను." - 'ఎక్స్'లో మంత్రి లోకేశ్ పోస్ట్
'లోకేశ్ బాగా పని చేశావు' - చంద్రబాబు అభినందనలు
మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు - వయో పరిమితిపై లోకేశ్ ఏమన్నారంటే!