ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దావోస్​లో మంత్రి లోకేశ్ బిజీబిజీ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు - MINISTER LOKESH DAVOS TOUR

రాష్ట్రంలో డెలవప్‌మెంట్‌ సెంటర్లు నెలకొల్పాలని వివిధ కంపెనీలను కోరిన మంత్రి లోకేశ్ - బోర్డు సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఆయా సంస్థల ప్రతినిధులు

Minister_Lokesh_Davos_Tour
Minister_Lokesh_Davos_Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 7:53 PM IST

Minister Lokesh Met Several Companies Representatives:దావోస్‌ పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి లోకేశ్ వివిధ సంస్థల ప్రతినిధులను పెట్టుబడులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమన్నార్‌తో సమావేశమైన ఆయన రాష్ట్రంలో మాస్టర్‌కార్డ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే, దక్షిణాదిలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుదని అన్నారు.

కంపెనీ ప్రాధాన్యతైన ఫిన్‌టెక్‌కు అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్ ఫోర్స్ తయారీకి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని అభ్యర్ధించారు. బోర్డు సభ్యులతో చర్చించి రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని లోకేశ్​కు రాజమన్నార్‌ భరోసా ఇచ్చారు. భారత్​లో పెరుగుతున్న క్రెడిట్ అవకాశాలు ఉపయోగించుకొని, భాగస్వాములతో కలిసి సేవలు విస్తరించేందుకు మాస్టర్ కార్డ్ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు.

విశాఖలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్: మరోవైపు బహుళ జాతి ఐటీ సంస్థ సిస్కో ఉపాధ్యక్షురాలు ప్రాన్సిన్ కట్సౌదాస్‌నూ లోకేశ్ కలిశారు. విశాఖలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్‌ ఫోర్స్‌లో 25 శాతానికిపైగా తెలుగువారేనని అన్నారు. భారత్‌లో అతిపెద్ద ఐటీ టాలెంట్ పూల్‌ ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సిస్కో దీర్ఘకాల వ్యూహానికి అనువుగా ఉంటుందని, కంపెనీ తయారీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని కోరారు. కృత్రిమ మేథ, నెట్‌వర్కింగ్, సైబర్‌ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్‌ఫోర్స్‌ తయారీకి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సిస్కోకు బెంగుళూరులో విప్రో, ఇన్ఫోసిస్‌లతో జాయింట్ డెవలప్​మెంట్ సెంటర్లు ఉన్నాయన్న కట్సౌదాస్‌ భారత్‌లో ఒకటిన్నర బిలియన్ డాలర్లు వెచ్చించి ఫ్లెక్స్ సంస్థ భాగస్వామ్యంతో కాంట్రాక్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 5 లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై కంపెనీలోని సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిస్కో ఉపాధ్యక్షురాలు ప్రాన్సిన్ కట్సౌదాస్‌ లోకేశ్​కు భరోసా ఇచ్చారు.

ఏపీలో మెగా సిటీలుగా ఆ ప్రాంతాలు - అమరావతి ఓఆర్‌ఆర్​తో మారనున్న రూపురేఖలు

ఆటోమొబైల్ సప్లయ్ చైన్ ఏర్పాటు: రాష్ట్రంలో తయారీ యూనిట్‌ నెలకొల్పాలని జెడ్​ఎఫ్ ఫాక్స్ కాన్ ఛాసిస్ మాడ్యుల్స్ సీఈఓ ఐకీ డోర్ఫ్‌ను లోకేశ్ కోరారు. రాష్ట్రంలోని రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టుల ద్వారా కంపెనీ సప్లయ్ చైన్ కార్యకలాపాలు మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. ఆటోమొబైల్ తయారీ, సరఫరా సప్లయ్ చైన్ ఏర్పాటుకు విశాఖ, విజయవాడ, అనంతపురం వ్యూహాత్మక ప్రాంతాలని వివరించారు. కియా, ఇసుజు వంటి సంస్థలు ఏపీలో వాహనాలు ఉత్పత్తి చేస్తున్నాయని లోకేశ్ వివరించగా కంపెనీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఐకీ డోర్ఫ్‌ హామీ ఇచ్చారు.

స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్: రాష్ట్రంలో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్ నెలకొల్పాలని ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా గోంట్కోవికోవాను లోకేశ్ కోరారు. ప్రకాశం, గుంటూరు పరిసరాల్లో పెద్దఎత్తున పొగాకు సాగు చేస్తున్నందున ఆయా ప్రాంతాలు అనుకూలమని వివరించారు. సప్లయ్ చైన్ కార్యకలాపాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వంతోపాటు గుంటూరులోని టొబాకో బోర్డు సహాయ, సహకారాలు అందిస్తాయని తెలిపారు.

గుంటూరులో రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేసిన ఫిలిప్ మోరిస్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రియా, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా పర్యావరణ పరిరక్షణ –వాతావరణ ఉద్యమ భవిష్యత్ అనే అంశంపై స్వనీతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. పునరుత్పాతక విద్యుదుత్పత్తిలో ఏపీని అగ్రగామిగా నిలిపేలా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024ను ప్రకటించామని మంత్రి లోకేశ్ వివరించారు.

గ్రీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు ఏపీ హబ్‌గా మారబోతోంది: సీఎం చంద్రబాబు

భావనపాడులో పెట్రో కెమికల్‌ హబ్‌ ఏర్పాటు చేయండి - లక్ష్మీమిత్తల్‌ను కోరిన నారా లోకేశ్‌

ABOUT THE AUTHOR

...view details