IPS Transfers in AP :ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కీలకమైన ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. జగన్ అస్మదీయులకు కీలక పోస్టింగ్‌లో స్థానం కల్పించింది. 30 మంది అధికారుల పోస్టుల్లో మార్పులు చేర్పులు చేసింది. కీలకమైన ఎన్నికల సమయంలో వారు ఆయా పోస్టింగ్‌ల్లోనే కొనసాగనున్నారు. వైకాపాతో అంటకాగిన అధికారులకు కీలక స్థానాలే దక్కాయి. నైపుణ్యాభివృద్ధి కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నిఘా విభాగం ఐజీ కొల్లి రఘురామ్‌రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాధిపతిగా నియమించింది. డైరెక్టర్ జనరల్ స్థాయి హోదా కలిగిన అధికారులను మాత్రమే ఈ పోస్టుకు ఎంపిక చేస్తారు. కానీ ఐజీ హోదా కలిగిన రఘురామ్ రెడ్డికి డీజీ ర్యాంకు పోస్టు కట్టబెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్‌కు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులను సైతం రఘురామిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వైఎస్సార్సీపీకి చేసిన సేవలకు ప్రతిఫలంగా ఆయనకు ఈ పోస్టింగు దక్కిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అధికార పార్టీకి కొమ్ముకాసిన మరికొందరు అధికారులకు సైతం కీలక పోస్టులు దక్కాయి. కర్నూలు రేంజి డీఐజీగా నియమితులైన సీహెచ్. విజయారావు 2021-2023 మధ్య నెల్లూరు జిల్లాలో ఎస్పీగా పని చేశారు. వ్యవసాయ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నిందితుడిగా ఉన్న ఓ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టు నుంచి చోరీకి గురైన ఘటనలో వైఎస్సార్సీపీకి పూర్తి అనుకూలంగా వ్యవహరించారు. చోరీ కేసులో ఆధారాలు తారుమారు చేశారన్న విమర్శలూ ఉన్నాయి. అధికార పార్టీ నాయకులతో కలిసి వేధించడంతో పలువురు దళితులు ఆత్మహత్యలు చేసుకోగా, కొందరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అలాంటి అధికారికి కర్నూలు రేంజ్ డీఐజీగా బాధ్యతలు ఇచ్చారు.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు.. అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు
విశాఖ రేంజీ డీఐజీగా నియమితులైన విశాల్ గున్నీ సైతం 2020-22 మధ్య కాలంలో గుంటూరు ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించిన వారిపై లాఠీఛార్జీకి పాల్పడ్డారు. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా వ్యవహరిస్తున్న ఆయన ఇటీవల అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని తీవ్రంగా అణిచిచేశారు. అందుకు ప్రతిఫలంగానే అత్యంత కీలకమైన విశాఖ రేంజీ డీఐజీగా నియమించారన్న విమర్శలున్నాయి.