Illegal Sand Mining Continues Under YCP Regime:వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో అక్రమ ఇసుక తవ్వకాలు నిత్యం జరుగుతూనే ఉంటున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలతో నెల్లూరులో పెన్నమ్మ నదిని కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలిస్తున్నారు. అనుమతులు నిలిచిపోయి ఏడాది దాటినా దందా కొనసాగించిన అక్రమార్కులు చివరకు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా దోపిడీకి మాత్రం తెరదించలేదు. ఎన్జీటీ తీర్పును, రాష్ట్ర స్థాయి పర్యావరణ మదింపు సంస్థ ఆదేశాలను ధిక్కరించి నదీ గర్భంలోనూ తోడేశారు.
సోమశిల దిగువ ప్రాంతం నుంచి విడవలూరు నది సముద్రంలో కలిసే వరకు పలుచోట్ల ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేశారు. మొదట్లో అడ్డుకునేందుకు యత్నించిన కొందరు అధికారులపై ఒత్తిడి తీసుకురావడం బదిలీల పేరుతో వేధించడంతో అధికారులు ఆ తర్వాత వారు మాకెందుకులే అని పట్టించుకోవడమే మానేయగా అదే అదనుగా రూ.కోట్ల విలువైన ప్రకృతి సంపద దోచుకోవడంతో పాటు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించారని పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్పంచ్ ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా - నిత్యం వందలాదిగా ట్రాక్టర్లు - Villagers Protest on Sand Mining
జిల్లాలో దొరికే ఇసుకకు ఇతర ప్రాంతాల్లో భారీ గిరాకీ ఉండటంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై కన్నేసింది. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన వనరులను జగన్ ప్రభుత్వం వ్యాపారంగా మార్చింది. అప్పటి వరకు అమల్లో ఉన్న విధానాన్ని రద్దు చేసింది. జిల్లాలోని పెన్నా పరీవాహకంలో 8 ఓపెన్ రీచ్‌లను గుర్తించి 2019 సెప్టెంబరులో కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఏపీఎండీసీ ద్వారా విక్రయాలు జరిపింది. ఆ తర్వాత మరో కొత్త విధానం తెచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. వెంటనే ఓ గుత్తేదారు సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఆ సంస్థ నుంచి అధికార పార్టీకి చెందిన వ్యక్తులు జిల్లాలో ఇసుకను రూ. 21 కోట్లకు లీజుకు తీసుకున్నారు. దాన్ని చెల్లించడంతో పాటు అధికంగా లాభం పొందాలనే ఉద్దేశంతో అక్రమాలకు తెరదీశారు. 2022 డిసెంబరు నాటికి దాదాపు జిల్లాలోని అన్ని రీచ్‌ల గడువు ముగిసినా తవ్వకాలు మాత్రం ఆగలేదు.
ఎన్నికల కోడ్ కూసినా ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడదా ! - Krishna River Illegal Sand Mining
ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా మీటరు నుంచి మీటరున్నర లోతు మాత్రమే తవ్వాల్సి ఉంది. 10 నుంచి 15 అడుగుల వరకు తవ్వుతున్నారు. దీంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఉందని సమీప గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునేవారు లేరు. ఇసుక లారీల రాకపోకలతో పొర్లుకట్టలు ధ్వంసమవడంతో పాటు రోడ్లన్నీ గుంతలమయంగా మారుతున్నాయని ప్రజలు ఆందోళన చేస్తున్నా కొందరు స్థానిక అధికారులు గుత్తేదారులకే కొమ్ముకాయడం పరిపాటిగా మారింది. నిత్యం వందల లారీల రాకపోకల కారణంగా ఏర్పడుతున్న శబ్దాలతో నిద్రపోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతివేగం కారణంగా పిల్లలకు ఏం జరుగుతోందనన్న ఆందోళన చెందుతున్నా జిల్లా అధికారులకు వినిపించడం లేదని ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక ఎక్కడికి? ఏ అవసరాలకు పోతుందో అన్నదీ తెలియటం లేదు.
పల్నాడు జిల్లాలో 'కుటుంబ అవినీతి కథా చిత్రం' - ఇసుకేస్తే రాలనంత అవినీతి!
ప్రభుత్వ అనుమతి తీసుకున్న గుత్తేదారు సంస్థ గడువు ముగిసినా అదే పేరుతో దాదాపు ఏడాదిన్నర పాటు జిల్లాలో ఇసుక తవ్వకాలు జరిపింది. ఆ విషయం జిల్లాలో పనిచేస్తున్న మైనింగ్ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అనుమతి వస్తుందంటూ తవ్వకాలను అడ్డుకోలేదు. ఫలితంగా రూ. కోట్ల విలువైన వనరు సరిహద్దులు దాటిపోయింది. జిల్లాలోని ఎనిమిది రీచ్‌ల్లో ఐదింటిలో నిత్యం తవ్వకాలు జరిగాయి. ఒక్కో చోట రోజుకు 200 లారీలు, 300 ట్రాక్టర్ల చొప్పున లెక్కవేసుకుంటే రోజుకు రూ. 28.5 లక్షల విలువైన సంపద దోచుకున్నారు. ఈ లెక్కన ఐదు రీచ్‌లకు కలిపి రూ. 1.42 కోట్లు కాగా 30 రోజులకు రూ. 42.75 కోట్లుగా తేలింది. ఈ విధంగా గడువు ముగిసిన నాటి నుంచి ఎన్నికల కోడ్ వచ్చే వరకు 15 నెలల్లో రూ. 641.25 కోట్లు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లినట్లేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అధికారుల అండతో ఇసుక దోపిడీ- కనుమరుగవుతున్న భూములు - Illegal Sand Mining in Konaseema