Bank Manager Fraud in Palnadu District :పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట, నరసరావుపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు మేనేజర్ నిర్వాకానికి ఖాతాదారులు నిండా మునిగారు. పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము ఖాతాల్లో లేదని తెలిసి హతాశులయ్యారు. రెండు శాఖల్లో కోట్ల రూపాయల మేర అక్రమాలు జరగడంతో ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచి మేనేజర్‌గా 2017 ఏప్రిల్‌లో నరేశ్ చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టాడు. అతడు ఇంటింటికీ వెళ్లి ఖాతాదారులతో మమేకమయ్యాడు. బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయాలని కోరాడు. రూపాయికిపైగా వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు.
స్వయానా మేనేజరే ఇంటికి రావడంతో చాలా మంది నరేశ్ చంద్రశేఖర్ బుట్టలో పడ్డారు. ఈ క్రమంలోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసి బాండ్లు తీసుకున్నాడు. కొందరి ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్మును రెన్యూవల్ చేస్తున్నట్లు చెప్పి ఓటీపీలు చెప్పించుకున్నాడు. ఖాతాదారుల సొమ్మును తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలోకి మళ్లించుకున్నాడు. కొన్నాళ్లకు చిలకలూరిపేట నుంచి నరసరావుపేట బ్రాంచ్‌కి బదిలీపై వెళ్లిన నరేశ్ అక్కడా అదే మోసానికి తెబగడ్డాడు.
CID Inquiry ICICI Bank Fraud Case :నరేశ్ తన ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా నుంచే ఖాతాదారులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. ఐతే ఈ నెల వడ్డీ డబ్బు జమకాలేదు. అనుమానం వచ్చి ఖాతాదారులు బ్యాంకుకు వెళ్లి అడిగితే అప్పడు మొత్తం విషయం బయటపడింది. మోసపోయిన బాధితులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ బ్యాంకు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. చిలకలూరిపేట బ్రాంచిలో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసే హరీశ్ సహకారంతో లాకర్లలో దాచుకున్న బంగారాన్నీ నరేశ్ మాయం చేసినట్లు బయటపడింది.
"మా ఎఫ్‌డీల నుంచి డబ్బులను ఇతర అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మా పేరు చెక్కులు కావాలని తీసుకున్నారు. వాటిలో అమౌంట్ ఎక్కువ వేసి చూపించారు. నరేశ్, హరీశ్ ఇద్దరూ కలిసి ఈ మోసానికి పాల్పడ్డారు. అధికారులను సంప్రదిస్తే మీ అకౌంట్లలో డబ్బులు లేవని అంటున్నారు. దర్యాప్తు జరిపి మాకు న్యాయం చేస్తామని అధికారులు అంటున్నారు." - బాధితులు