Krishna District Rains 2024 :మచిలీపట్నంతో పాటు, గుడివాడ, గన్నవరం తదితర ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలో పలు చోట్ల చెరువుల గండిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద రామిలేదరు వాగు, ముస్తాబాద వద్ద కళింగ చెరువు, ఏలూరు-బుడమేరు పంట కాలువల మధ్య ఉండే మార్గంలో బుడమేరు కాలువకు భారీగా వరద నీరు చేరింది.
Heavy Rains in AP :ఏలూరు- బుడమేరు పంట కాలువల మధ్య ఉండే జక్కులనెక్కలం గ్రామానికి రాకపోకలు స్తంభించాయి. గన్నవరం పోలీస్‌స్టేషన్‌లోకి కూడా వరద చేరడంతో విధులకు ఇబ్బంది తప్పలేదు. కృష్ణా నదికి విపరీతంగా వరదనీరు చేరటంతో దివిసీమలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 72,000ల ఎకరాలు నీటమునిగాయి. తోట్లవల్లూరు మండలంలో పలు మంపు ప్రాంతాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జాయింట్ కలెక్టర్ గీంతాంజలి శర్మ అధికారులతో కలిసి పరిశీలించారు.
ఉమ్మడి జిల్లాలో పాల కొరత : తోడేళ్లదిబ్బ, కలింగదిబ్బ, తుమ్మలపచ్చిక, పములలంక, పిల్లివానిలంక, పొట్టిదిబ్బలలంక, కనిగిరిలంక, ములకపల్లిలంక గ్రామాల్లోని ప్రజలను బోట్లు, పడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. బుడమేరు ఉద్ధృతంగా ప్రవహించడంతో చిట్టినగర్‌లో ఉన్న విజయ డెయిరీ యూనిట్‌కి వరద ముంచెత్తింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వరద పెరగడంతో విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు, పాల ట్యాంకర్లు, పాల ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు తరలించే వాహనాలు లోపలే ఇరుక్కున్నాయి. ఫ్యాక్టరీ లోపల 1.50 లక్షల పాల ప్యాకెట్లు, లక్ష కిలోల పెరుగు సహా సుమారు రూ.65 కోట్ల విలువ చేసే ఉత్పత్తులు దాదాపు పాడైనట్లు డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరరావు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లాలో పాల కొరత ఏర్పడింది.