Rains in Joint Krishna District :ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లా అతలాకుతాలమవుతోంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Vijayawada Rains Updates :రెండు రోజుల పాటు విజయవాడలో కుండపోత వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు 4 అడుగుల మేర నిలవడంతో ఎటు చూసిన చెరువులను తలపిస్తోంది. ముఖ్యంగా జిల్లాకు గుండెకాయ వంటి విజయవాడలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రధాన బస్టాండ్ తో పాటు రైల్వేస్టేషన్ చుట్టూ వరద నీరు చేరింది. ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు అడుగు ముందుకు జరపలేని పరిస్థితిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలిచింది. విజయవాడ-నూజివీడు మధ్య రాకపోకలకు వాహనదారుల అవస్థలు అన్ని ఇన్నీ కావు. ఇక సింగ్‌నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్‌నగర్‌లు పూర్తిగా చెరువులను తలపిస్తున్నాయి.
ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న బుడమేరు : బుడమేరు వాగులో భారీగా వరదనీరు చేరడంతో లొతట్టు ప్రాంతాలకు వరద ఉధృతి పెరిగింది. దీంతో దిగువన ఉన్న నివాస వీధుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. అనేక మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వద్ద ప్రమాద భరితంగా ప్రవహిస్తోంది. వంతెనకు నాలుగు అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలతో గుడివాడ హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు మూసివేశారు. హనుమాన్ జంక్షన్, ఏలూరు వైపు వెళ్లాలనుకునేవారు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అధికారులు వెళ్లాలని సూచించారు. మరోవైపు అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగాయి.
ఉగ్రరూపం దాల్చిన మున్నేరు :ఎన్టీఆర్ జిల్లాలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. పరివాహక గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రమాదకర స్థాయిలో పెనుగంచిప్రోలు చెరువు ప్రవహిస్తోంది. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై ప్రమాద స్థాయిలో వరద చేరింది. ఈ క్రమంలోనే తిరుపతమ్మ ఆలయాన్ని వరద చుట్టుముట్టడంతో పాటు దుకాణాల్లోకి చేరింది. ఎస్సీ కాలనీ, బోస్పేట జలమయమైంది. పెనుగంచిప్రోలు మండలంలో శనివారం నుంచి అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. రహదారులపై గుంతలు పడటంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి.